హెచ్1బి వీసాలపట్ల అమెరికా వ్యవహరిస్తున్న తీరుపై విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్ ఆందోళన వ్యక్తం చేస్తూ, ఈ అంశంపై సానుకూలంగా స్పందించాలని అమెరికన్ కాంగ్రెస్ ప్రతినిధి బృందాన్ని కోరారు. భారత్లో పర్యటిస్తున్న 9 మంది సభ్యులతో కూడిన అమెరికా కాంగ్రెస్ ప్రతినిధి బృందంతో మంగళ వారం ఆమె భేటీ అయ్యారు. ఈ సందర్భంగా హెచ్1బి వీసా అంశాన్ని లేవనెత్తారని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రవీష్ కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు. శాస్త్ర, అంతరిక్షక, సాంకేతిక అంశాలపై ఏర్పడిన అమెరికా హౌస్ కమిటీ ప్రతినిధి బృందం చైర్మన్ లమర్ స్మిత్ నేతృత్వంలో భారత్లో పర్యటిస్తున్నారు.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ఇటీవల అమెరికా పర్యటించినప్పుడు జరిపిన సమావేశాలలో కూడా ఆయన హెచ్1బి వీసా అంశాన్ని ప్రస్తావించారు. వ్యూహాత్మక, ఆర్థిక, శాస్త్ర, సాంకేతిక, అంతరిక్ష రంగాలలో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని బలోపేతం చేసుకోవాలన్న అమెరికా ప్రతినిధి బృందం విజ్ఞప్తిని కూడా సుష్మా స్వరాజ్ స్వాగతించారని, భారత్-అమెరికా వ్యూహాత్మక సంబంధాలను అభివృద్ధి చేయడంలో అమెరికా కాంగ్రెస్ సానుకూల పాత్రను సుష్మా ప్రశంసించారని కుమార్ ట్విట్టర్లో పేర్కొన్నారు