విదేశీయుల కోసం జారీ చేస్తున్న హెచ్-1బి, ఎల్-1 వీసా ప్రక్రియలను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, ఔట్సోర్సింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపాలని అమెరికన్ కాంగ్రెస్‌కు చెందిన కొందరు సభ్యులు అధ్యక్షుడు డోనాల్డ్‌ట్రంప్‌కు విజ్ఞప్తి చేశారు. కొన్ని సంస్థలు హెచ్-1బి వీసాను దుర్వినియోగం చేస్తూ అమెరికన్ల స్థానంలో తక్కువ వేతనాలకు విదేశీ ఉద్యోగులను నియమించుకుంటున్నాయని వారు ట్రంప్‌కు రాసిన లేఖలో ఫిర్యాదు చేశారు.
"అధ్యక్షుడిగా మీ అధికారాన్ని ఉపయోగించి హెచ్-1బి వీసాల దుర్వినియోగాన్ని ఆపాలి" అని వారు కోరారు. ప్రస్తుతం అమలులో వున్న విధానాన్ని పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేసి అందులోని లొసుగులను తొలగిస్తారని తాము భావిస్తున్నట్లు వారు ఆ లేఖలో పేర్కొన్నారు.
అమెరికన్ ఉద్యోగులను పరిరక్షించటం కోసం తాము ప్రతిపాదించిన హెచ్ఆర్1303, ఎస్ 180, హెచ్-1బి, ఎల్-1 వీసా సంస్కరణల చట్టం ఈ లొసుగులను తొలగించి వీసా విధానాలను పూర్తి ప్రక్షాళన చేస్తుందని, ఔట్సోర్సింగ్ కంపెనీలపై ఉక్కుపాదం మోపుతుందని తాము భావిస్తున్నామని వారు చెప్పారు. కాంగ్రెస్ సభ్యుడు బిల్ పాస్క్రెల్ నేతృత్వంలో సెనేటర్ రిచర్డ్ డర్బిన్, కాంగ్రెస్ సభ్యులు దవే బ్రాత్, ఆర్ఒ ఖన్నా, పాల్ ఎ గోసర్ తదితరులు ఈ లేఖపై సంతకాలు చేశారు.