అమెరికాలో H1B వీసాలపై జరిపిన ఒక సర్వేలో ఎన్నో నిజాలు వెల్లడయ్యాయి. H1B వీసాలపై వలస వచ్చిన విదేశీయులు అమెరికాలో కొత్త ఆవిష్కరణలు, అమెరికన్ల సర్వతోముఖాభివృద్ధికి ఎంతో సహాయపడ్డారని సర్వే తెలిపింది. యూనివర్శిటీ అఫ్ మిషిగన్ కు చెందిన రిసెర్చర్లు జాన్ బౌండ్, నికోలస్ మోరేల్స్ లు అమెరికా ఆర్థికవ్యవస్థ పై విదేశీ కంప్యూటర్ నిపుణుల ప్రభావాన్ని అధ్యయనం చేశారు. 1994 నుంచి 2001 మధ్య వున్న సమయాన్ని తమ అధ్యయనానికి ఎన్నుకున్నారు. అప్పుడే ఎన్నో కొత్త ఆవిష్కరణలు వెలుగులోకి వచ్చాయి. దాంతో విదేశీ నిపుణులకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. వీరు H1B వీసాలపై అమెరికాకు వచ్చారు. 1990 లో మొదలైన IT బూమ్ లో జరిగిన కంప్యూటర్ సైంటిస్టులు వలసలు అమెరికాలోని వర్కర్లు, వినియోగదారులు టెక్ కంపెనీలపై చెప్పుకోదగ్గ ప్రభావం చూపించాయని వారు తెలిపారు.
బేండ్, మోరేల్స్ తో పాటు యూనివర్శిటీ అఫ్ కాలిఫోర్నియా - శాన్ డియాగోకు చెందిన గౌరవ్ ఖన్నా ఏమని కనుగొన్నారంటే ఎంతో నైపుణ్యం గల వలసదారులు, కొత్త టెక్నాలజీల ఆవిష్కరణలతో అటు అమెరికా ఆర్థికాభివృద్ధికి, ఇటు IT రంగ కంపెనీలకు అధిక లాభాలు ఆర్జించి పెట్టడంలో ఎంతో సహకరించాయని తెలిపారు. కంప్యూటర్ రంగంలో క్రాంతిని తెచ్చి వీరు ఐటీ వస్తువుల వుత్పత్తిని పెంచి రేట్లు తగ్గడానికి కారకులై వినియోగదారులకు అతి చవకగా అందుబాటులోకి వచ్చేందుకు సహకరించారు. దీంతో ఐటీ రంగానికి చెందిన కంపెనీలు విపరీతంగా లాభాలు సంపాదించేలా చేశారు. వలసదారులు అటు సాఫ్ట్ వేర్, ఇటు హార్డ్ వేర్ కంపెనీల వృద్ధికి ఎంతో సహాయపడ్డారని వారు తెలిపారు. కాకపోతే వీరు చవకగా తక్కువ వేతనాలకు లభ్యం కావటంతో, అమెరికాలోని కంప్యూటరు నిపుణులు తక్కువ వేతనాలకు పని చేయలేక వేరే ఉద్యోగాలు వెతుక్కోవలసి వచ్చిందన్నారు. అమెరికాలోనే కాక ప్రపంచవ్యాప్తంగా కొత్త టెక్నాలిజీలను అందరూ ఉపయోగించుకునేలా రూపొందించడంలో వలసదారులు గొప్ప పాత్ర పోషించారని రీసెర్చర్లు తెలిపారు. H1B వీసాలపై రభస జరుగుతున్న సమయంలో ఈ రిపోర్టు రావడం ఎంతైనా ముదావహం. అందరికి నిజాలు తెలియాలి. ముఖ్యంగా వలసదారులకు కూడా.