జీఎస్టీతో వేటి ధరలు పెరుగుతాయి? ఏవి తగ్గుతాయి అన్న చర్చ ఒకవైపు సాగుతుంటే, మరోవైపు ఈ కొత్త పన్ను సంస్కరణ నిరుద్యోగుల్లో ఆశలు రేపుతున్నది. జీఎస్టీతో ఇప్పటికిప్పుడు లక్ష ఉద్యోగులు కొత్తగా అవసరమవుతారని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా ట్యాక్సేషన్, అకౌంటింగ్, డేటా అనాలసిస్ స్పెషలిస్ట్‌లకు డిమాండ్ ఉండనుంది.
జులై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి రానున్న విషయం తెలిసిందే. జీఎస్టీతో ప్రతి ఏటా ఉద్యోగ రంగంలో పది నుంచి 13 శాతం వృద్ధి రేటు ఖాయమని నిపుణులు చెబుతున్నారు. ఆర్థికరంగంలోని వివిధ సెగ్మెంట్లలో ప్రొఫెషనల్స్‌కు డిమాండ్ ఏర్పడుతుందని ఇండియన్ స్టాఫింగ్ ఫెడరేషన్ అధ్యక్షురాలు రితుపర్ణ చక్రవర్తి తెలిపారు.
జీఎస్టీ అమలు తేదీ నుంచి తొలి త్రైమాసికంలోనే కనీసం లక్ష మంది కొత్త ఉద్యోగాలు వస్తాయని ఎగ్జిక్యూటివ్ సెర్చ్ కంపెనీ గ్లోబల్‌హంట్ ఎండీ సునీల్ గోయెల్ చెప్పారు. ఆ తర్వాత కూడా జీఎస్టీలో కొన్ని ప్రత్యేక పనుల కోసం మరో 50 వేల నుంచి 60 వేల ఉద్యోగులు అవసరమవుతారని ఆయన అన్నారు. చిన్న, మధ్య స్థాయి కంపెనీలు ఈ పనుల కోసం థర్డ్ పార్టీ అకౌంట్ సంస్థలను ఆశ్రయిస్తాయని గోయెల్ తెలిపారు.
జీఎస్టీ నిర్వహణ కోసమే ప్రత్యేకంగా కంపెనీలు ప్రొఫెషనల్స్‌ను నియమించుకోవాల్సిన పరిస్థితి వస్తుందని నిపుణులు భావిస్తున్నారు. ఇక రంగాలవారీగా చూస్తే ఇప్పటికిప్పుడు ఆటోమొబైల్స్, హోమ్ డెకార్, ఈ-కామర్స్, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్, సిమెంట్, ఐటీ, బీఎఫ్ఎస్ఐ, కన్జూమర్ డ్యూరబుల్స్, ఫార్మా, టెలికాం రంగాలపై జీఎస్టీ ప్రభావం అత్యధికంగా ఉండనుంది.