//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మూడేళ్ళ కనిష్ట స్థాయిలో వృద్ధి రేటు

Category : national

పెద్ద నోట్ల రద్దు నిర్ణయం వరుసగా మూడు త్రైమాసికాలపాటు వృద్ధి గణాంకాలపై తీవ్ర ప్రభావం చూపింది. తయారీ రంగ పనితీరు కుంటుపడటంతోపాటు పెద్ద నోట్ల రద్దు ప్రభావంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికానికి (ఏప్రిల్-జూన్) స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) 5.7 శాతానికి పడిపోయింది. దాంతో వృద్ధిరేటు మూడేళ్ళ కనిష్ఠానికి జారుకున్నైట్లెంది. మార్చి 2014తో ముగిసిన మూడునెలల కాలానికి భారత జీడీపీ 4.6 శాతంగా నమోదైంది.

మోదీ ప్రభుత్వ హయాంలో ఇదే కనిష్ఠ స్థాయి ఆర్థిక వృద్ధిరేటు. అంతేకాదు, భారత త్రైమాసిక వృద్ధిరేటు చైనా కంటే తగ్గడం వరుసగా ఇది రెండోసారి. గడిచిన రెండు క్వార్టర్లలో చైనా వృద్ధిరేటు 6.9 శాతంగా నమోదైంది. జనవరి-మార్చి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.1 శాతంగా నమోదైంది.

గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2016-17) మొదటి త్రైమాసికానికి సవరించిన జీడీపీ 7.9 శాతంగా ఉంది. గడిచిన మూడు నెలలకు వృద్ధిరేటు త్రైమాసిక ప్రాతిపదికన మరింత తగ్గగా.. వార్షిక ప్రాతిపదికన చూస్తే భారీగా క్షీణించింది. ఆర్థికవేత్తలు, అంతర్జాతీయ ఆర్థిక కంపెనీలు, కన్సల్టింగ్ ఏజెన్సీలు మొదటి త్రైమాసిక జీడీపీని 6-6.6 శాతం మధ్యలో అంచనా వేశారు.

తాజా గణాంకాలు నిరాశాజనకంగా ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశాయి. గత ఏడాది నవంబర్‌లో రూ.500, రూ.1000 నోట్లను రద్దు చేస్తూ మోదీ సర్కారు తీసుకున్న తొందరపాటు నిర్ణయం వల్లే వృద్ధి భారీగా క్షీణించిందని కాంగ్రెస్ ఆరోపించింది. దేశంలోని ఎనిమిది కీలక రంగాల వృద్ధి జూలై నెలలో 2.4 శాతానికి తగ్గింది. ముడిచమురు, రిఫైనరీ ఉత్పత్తులు, ఎరువులు, సిమెంట్ రంగాల పనితీరు క్షీణించడం ఇందుకు కారణమైంది.