శుక్రవారం జమ్మూకశ్మీర్ కేంద్ర పాలిత ప్రాంతాల్లో ప్రార్థనలతోపాటు ఈ నెల 12వతేదీన ఈదుల్ జుహా పండుగ సందర్భంగా జరగనున్న ప్రార్థనల సందర్భంగా కేంద్రం భారీ బలగాలను ఏర్పాటుచేసింది. ప్రత్యేక ప్రతిపత్తిని జమ్మూ కశ్మీరుకు రద్దు చేస్తూ, ఆ రాష్ట్రాన్ని విభజిస్తూ కేంద్రం ప్రకటన చేసిన తర్వాత జమ్మూ కశ్మీరులో శుక్రవారంతోపాటు ఈద్ సందర్భంగా ముస్లిములు ప్రార్థనలు చేసుకునేందుకు భద్రతా బలగాలు వీలు కల్పించనున్నాయి. జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూకశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ తో సమావేశమై లోయలో శాంతిభద్రతల పరిస్థితులపై సమీక్షించారు.
అయితే శుక్రవారం ప్రార్థనల సందర్భంగా కర్ఫ్యూ స్థానంలో 144 సెక్షన్ ను అమలు చేయాలని నిర్ణయించారు. అంతే కాకుండా శుక్రవారం కశ్మీర్ లో మొబైల్ ఇంటర్నెట్ బ్రాడ్ బాండ్ సర్వీసులను నిలిపివేయాలని నిర్ణయించారు. నాలుగైదు చోట్ల రాళ్లు రువ్విన ఘటనలు జరిగిన నేపథ్యంలో భద్రతాబలగాలు అప్రమత్తమయ్యాయి. శుక్రవారం ప్రార్థనలతోపాటు ఈద్ సందర్భంగా ఎలాంటి ఆందోళనలు జరగకుండా కేంద్ర బలగాలను మోహరించారు.