//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రాజ్యసభ కు వెళ్లే వారు ఎవరో తెలుసా...!

Category : politics

రెండు తెలుగు రాష్ట్రాల్లో త్వ‌ర‌లో జ‌రిగే రాజ్య‌స‌భ ఎన్నిక‌ల్లో అధికార పార్టీ సీటు ద‌క్కించుకునేందుకు ఆశావాహుల లిస్ట్ చాలానే ఉంది. ఏపీలో 3, తెలంగాణ‌లో 3 రాజ్య‌స‌భ స్థానాల‌కు ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి. తెలంగాణ‌లో మూడు సీట్లు అధికార పార్టీకే ద‌క్క‌నున్నాయి.

గ‌త ఎన్నిక‌ల్లో టీఆర్ఎస్ 63 సీట్లు గెలుచుకున్నా, ఆప‌రేష‌న్ ఆక‌ర్ష్ నేప‌థ్యంలో ఇప్పుడు ఇత‌ర పార్టీల నుంచి వెళ్లిన జంపింగ్ ఎమ్మెల్యేల‌తో క‌లుపుకుంటే టీఆర్ఎస్‌కు మొత్తం 88 సీట్లు ఉన్నాయి. దీంతో మూడు రాజ్య‌స‌భ సీట్లు టీఆర్ఎస్‌వే.

ఇక ఈ మూడు సీట్ల కోసం టీఆర్ఎస్‌లో పోటీ ఉన్న వాళ్ల లిస్ట్ చూస్తే చాల ఉంది. అయితే లెక్క‌ల మాస్టార్, తిరుగులేని వ్యూహ‌క‌ర్త అయిన కేసీఆర్ రాజ్య‌స‌భ సీట్ల‌కు అభ్య‌ర్థుల ఎంపిక‌లో ఇప్ప‌టికే ఓ అంచ‌నాకు వ‌చ్చార‌ని తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఆయ‌న ఈ మూడు సీట్ల‌ను మూడు వ‌ర్గాల‌కు కేటాయిస్తూ అదిరిపోయే స్కెచ్ గీసి ప్ర‌త్య‌ర్థుల‌కు సైతం దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇస్తున్నార‌ట‌.

ఇప్ప‌టికే కేసీఆర్ మ‌దిలో కొంత‌మంది అభ్య‌ర్థులు ఉన్నార‌ని, ప్రాథమికంగా అభ్య‌ర్థుల‌పై ఆయ‌న ఓ నిర్ణ‌యానికి వ‌చ్చేశార‌ని తెలుస్తోంది. ఈ మూడు స్థానాల‌ను కేసీఆర్ మూడు వ‌ర్గాల‌కు కేటాయిస్తార‌ని తెలుస్తోంది. దీంతో కులాలు, వ‌ర్గాల స‌మ‌తుల్య‌త ఉంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో అది పార్టీకి, త‌న‌కు చాలా ప్ల‌స్ అవుతుంద‌న్న‌దే కేసీఆర్ ప్లాన్‌.

బీసీ సామాజిక వర్గానికి చెందిన గొల్ల లేదా కురమ కులస్తులో ఒకరికి రాజ్యసభ స్థానం కేటాయిస్తామని కేసీఆర్ ఇప్ప‌టికే చెప్పారు. ఈ లిస్టులో మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, నోముల నర్సింహయ్యతో పాటు రాజయ్యయాదవ్ , మురళీ యాదవ్ ఉన్నారు.

ఇక ఓసీ కులాల్లో హోం మంత్రి నాయినిని రాజ్య‌స‌భ‌కు పంపుతార‌న్న ప్ర‌చారం ఎప్ప‌టి నుంచో ఉంది. ఇక కొత్త‌గా కేసీఆర్ స‌మీప బంధువు జోగిన‌ప‌ల్లి సంతోష్‌రావు పేరు ఇప్పుడు కొత్త‌గా తెర‌మీద‌కు వ‌స్తోంది. ఆయ‌న ఉద్యమ సమయం నుంచి కేసీఆర్‌ వెంట ఉన్నారు. ఇక మూడో స్థానాన్ని దళితులు లేదా మైనార్టీలకు కేటాయించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

తెలంగాణాలో ఎస్సీ వర్గీకరణ ఉద్యమ నేపథ్యంలో మాదిగ సామాజిక వర్గానికి చెందిన నేతకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం ఉంది. అలాగే తెలంగాణ‌లో అధికార పార్టీ నుంచి ఉప మ‌ఖ్య‌మంత్రి మ‌హ‌మూద్ ఆలీని మిన‌హాయిస్తే ఇక్క‌డ నుంచి ఎంపీలుగా ఆ పార్టీ త‌ర‌పున ఎవ్వ‌రూ లేరు. ఇక వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ మైనార్టీల ఓట్ల‌పై వ‌ల వేసేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తోంది.

దీంతో మైనార్టీల‌కు కూడా రాజ్య‌స‌భ సీటు ఇచ్చే ఛాన్స్ ఉందన్న ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తానికి మూడు రాజ్యసభ స్థానాలకు చాలామంది ఇప్పటినుంచే ప్రయత్నాలు మొదలుపెట్టారు.