ప్రపంచంలో జనాభా కన్నా మొబైల్ ఫోన్లు వాడే వారి సంఖ్య వేగంగా పెరుగుతున్నది. 500 కోట్ల మంది ప్రజలు ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లను ఇప్పుడు వాడుతున్నారు. ఇది ప్రపంచ జనాభాలో 2/3వ వంతు సంఖ్య కన్నా ఎక్కువే కావడం గమనార్హం.
జీఎస్ఎంఏ ఇంటెలిజెన్స్ అనే సంస్థ అధ్యయనం ప్రకారం గడచిన నాలుగేళ్ల కాలంలోనే ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడుతున్న వారి సంఖ్య ఏకంగా 100 కోట్లకు చేరుకుంది.
ఇక ప్రస్తుతం మొబైల్ ఫోన్ యూజర్లలో 55 శాతం ఆసియా పసిఫిక్ ప్రాంతంలో ఉండగా, అందులో భారత్, చైనాలే అత్యధిక మొబైల్ ఫోన్ యూజర్లను కలిగి ఉన్నాయి. ప్రపంచంలో అత్యధిక సంఖ్యలో మొబైల్స్ వాడుతున్న దేశాలు ఈ రెండే కావడం గమనార్హం.
భారత్లో ప్రస్తుతం 73 కోట్ల మంది మొబైల్ యూజర్లు ఉన్నట్టు అంచనా వేశారు. దేశాలు, వాటి జనాభా పరంగా చూసుకుంటే యూరప్ దేశాల జనాభాలో 86 శాతం మందికి పైగా మొబైల్ ఫోన్లను వాడుతున్నారు. అతి తక్కువ మొబైల్ యూజర్లు ఆఫ్రికాలో ఉన్నారు.
2020వ సంవత్సరానికల్లా ప్రపంచ వ్యాప్తంగా మొబైల్ ఫోన్లను వాడే వారి సంఖ్య 570 కోట్లకు పైగానే చేరుకుంటుందని అంచనా వేస్తున్నారు. భారత్లో ప్రస్తుతం ఉన్న మొబైల్ యూజర్ల కన్నా 30 శాతం అధిక యూజర్లు 2020 వరకు పెరిగే అవకాశం ఉన్నట్టు భావిస్తున్నారు.