అంటర్కిటికా ఖండంలో ఉన్న ఐదు వేల చదరపు కిలోమీటర్ల వైశాల్యం కలిగిన ఓ భారీ మంచుకొండకు చీలిక ఏర్పడిందని, ఒకవేళ అది విడిపోతే పడవలకు ఇబ్బందులు తప్పవని శాస్త్రవేత్తలు బుధవారం వెల్లడించారు. అమెరికాలోని డెలావేర్ రాష్ట్రం లేదా ఇండోనేషియాలోని బాలీ ద్వీపం అంత పెద్దగా ఉండే లార్సెన్ సీ మంచు పలక నుంచి ఓ భాగం విడిపోతున్నదని తెలిపారు. 175 కిలోమీటర్ల పొడవు ఉన్న ఈ మంచు పలక నుంచి 13 కిలోమీటర్ల మేర ఉన్న భాగానికి మధ్య పగులు ఏర్పడింది. ఈ పరిస్థితి మమ్మల్ని అయోమయానికి గురి చేసిందని బ్రిటీష్ అంటార్కిటిక్ సర్వేకు చెందిన అండ్రూ ఫ్లెమింగ్ పేర్కొన్నారు. ఇది చిన్నపిల్లల ఊడిపోయే దంతం మాదిరిగా నానాటికీ వదులు అవుతున్నదని వివరించారు.
200 మీటర్ల మందంతో ఉండే ఈ మంచు పలక సముద్ర మట్టం నుంచి 20 మీటర్ల ఎత్తు ఉంటుంది. అంటార్కిటికాలో భారీ మంచు కొండలు వీడిపోవడం అనేది సర్వసాధారణంగా జరిగే పరిణామమే. మానవ తప్పిదాల వల్ల ఏర్పడుతున్న వాతావరణ మార్పులకు దీనికి సంబంధం ఉన్నదని శాస్త్రవ్తేతలు స్పష్టంగా పేర్కొనకపోయినా ఇటీవల కాలంలో అంటార్కిటికాలో మంచు వేగంగా కరిగిపోతున్నదనే వార్తల నేపథ్యంలో ఈ పరిణామం ఆందోళన కలిగిస్తున్నది.మంచుకొండ విడిపోవడానికి ఇతర కారణాలేవీ లేవని, ఇది మళ్లీ పెరిగే అవకాశం కూడా ఉంటుందని వేల్స్లోని స్వాన్సీ యూనివర్సిటీ ప్రొఫెసర్ ఆడ్రియన్ లాక్మాన్ పేర్కొన్నారు. అయితే ఇది విడివడటానికి కొన్ని నెలలు లేదా కొన్ని ఏండ్లు పట్టవచ్చని లాక్మాన్ ఆధ్వర్యంలోని బృందం తెలిపింది.