రాష్ర్టానికి చెందిన బిజినెస్ టెక్నాలజీ సొల్యుషన్స్ సంస్థ జీజీకే టెక్..హైదరాబాద్‌లో మూడో సెంటర్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. రూ.120 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ సెంటర్‌ను శుక్రవారం(ఈ నెల 12న) రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు ప్రారంభించనున్నట్లు కంపెనీ వ్యవస్థాపకుడు, సీటీవో శ్యామ్ పాల్‌రెడ్డి తెలిపారు.
ఉప్పల్‌లోని ఎన్ఎస్ఎల్ అరెనా సెజ్‌లో 63 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ సెంటర్లో వెయ్యి మంది ఇంజినీర్లు కూర్చోవడానికి వీలుంటుందన్నారు. అంతర్జాతీయ, దేశీయ ఐటీ సంస్థలు ఉద్యోగులను తీసివేస్తుండగా, కానీ జీజీకే భారీ స్థాయిలో రిక్రూట్ చేసుకోవడానికి సిద్ధమైంది. ఈ ఏడాది చివరి నాటికి వెయ్యి మంది సిబ్బందిని నియమించుకోనున్నట్లు రెడ్డి చెప్పారు. ఇప్పటికే హైదరాబాద్‌లో ఉన్న మిగతా రెండు సెంటర్లలో సుమారు వెయ్యి మందికి పైగా సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ఈ నియామక ప్రక్రియలో భాగంగా 2020 నాటికి సంస్థలో పనిచేసే సిబ్బంది సంఖ్యను 4 వేలకు పెంచాలనుకుంటున్నట్లు తెలిపారు. హెచ్1-బీ వీసాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఆయన స్పందిస్తూ..ఇది ఆఫ్‌షోర్ ఉద్యోగులపై తీవ్రస్థాయిలో ప్రభావం చూపనున్నదని, కానీ ఆన్‌షోర్ సిబ్బందిపై పెద్దగా కనిపించదన్నారు. ప్రస్తుతం సంస్థ అమెరికా, యూరప్, ఆస్ట్రేలియా మార్కెట్లపై ప్రత్యేక దృష్టి సారించినట్లు చెప్పారు. ఈ దేశాల నుంచి 100కి పైగా క్లయింట్లు ఉన్నారు. వ్యాపార విస్తరణలో భాగంగా అంతర్జాతీయంగా ఉన్న చిన్న స్థాయి కంపెనీలను కొనుగోలు చేయాలనుకుంటున్నట్లు ఆయన సంకేతాలిచ్చారు.