క్రిస్ గేల్” ముఖ్యంగా టి20 ఫార్మాట్ లో ఈ ఆటగాడు క్రీజ్ లో ఉన్నాడంటే ప్రత్యర్ధుల గుండెల్లో రైళ్ళు పరిగెడతాయి. అందరు డిఫెన్స్ కి ప్రాధాన్యత ఇస్తే బాబు మాత్రం ఆకాశమే హద్దుగా సిక్సర్లకు ప్రాధాన్యత ఇస్తూ ఉంటాడు. అయితే గత కొంత కాలంగా ఫాం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు గేల్.. ఈ క్రమంలో ఇతనిని బెంగళూరు జట్టు కూడా వద్దనుకున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలో అతని కనీస ధర 2 కోట్లకు పంజాబ్ జట్టు దక్కించుకున్న సంగతి తెలిసిందే. అయితే తనలో సత్తా ఏ మాత్రం తగ్గలేదని నిరూపించాడు గేల్.
చెన్నై తో జరిగిన మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. పంజాబ్ తరఫున తొలిసారి బరిలో దిగిన గేల్, రాహుల్(37) తోడుగా చెలరేగిపోయాడు. నాలుగో ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లు కొట్టిన గేల్.. చాహర్ వేసిన ఆరో ఓవర్లో మరింత రెచ్చిపోయాడు. అతను రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదడంతో పంజాబ్ స్కోరు పరుగులెత్తింది. అదే ఊపులో 22 బంతుల్లో అర్ధసెంచరీ చేసిన క్రిస్.. దొరికిన ప్రతి బౌలర్‌ను ఉతికారేశాడు. గేల్ ఆడకపోయి ఉంటె పంజాబ్ జట్టు తక్కువ పరుగులకే చాప చుట్టేసి ఉండేది. కాగా చెన్నై తో జరిగిన మ్యాచ్ లో పంజాబ్ 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుంది.