గంగూలీ సారధ్యంలో భారత జట్టులోకి అడుగుపెట్టిన యువకుల్లో టీం ఇండియా మాజీ ఓపెనర్ సెహ్వాగ్ ఒకడు. గంగూలీ శిష్యుడిగా కూడా సెహ్వాగ్ కి ప్రత్యేక గుర్తింపు ఉంది. ధోని సారధ్యంలో యువకులకు ప్రాధాన్యత ఎక్కువగా కల్పించడంతో టీంలో చోటు కోల్పోయిన సెహ్వాగ్ ఆ తర్వాత జట్టుకు దూరమైన సంగతి తెలిసిందే.
కొన్ని రోజులకు రిటైర్మెంట్ ప్రకటించాడు. అయితే తాజాగా సెహ్వాగ్ క్రికెట్ లోకి వచ్చిన తొలినాళ్ళలో ఏమి జరిగిందో గంగూలీ ఒక మ్యాచ్ సంఘటనను వివరించాడు. ముంబయిలో జరిగిన ఓ కార్యక్రమంలో సౌరభ్ గంగూలీ పాల్గొన్నాడు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ...2001లో ముక్కోణపు సిరీస్ కోసం శ్రీలంక పర్యటనకు వెళ్లాం. శ్రీలంకతో జరిగిన ఫైనల్లో 121 పరుగుల తేడాతో భారత్ ఓడిపోయింది. అనవసరపు షాట్‌కు యత్నించిన సెహ్వాగ్ రనౌట్ రూపంలో వెనుదిరిగాడు.
ఆ తర్వాతి రోజు ఉదయం 5.30 గంటల సమయంలో నా గది తలుపు మోగింది. తిరిగి భారత్ వెళ్లే క్రమంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే ముందు నన్ను కలవాలని వచ్చాడు. కానీ, నాకు ఏమో అంత పొద్దున్నే సెహ్వాగ్‌తో మాట్లాడే మూడ్ లేదు. దీంతో తర్వాత పిలిచి మాట్లాడతా అని చెప్పాను. ముందు రోజు ఫైనల్లో తాను ఆడిన విధానం పట్ల కెప్టెన్ సంతృప్తిగా లేడు.. ఏమనుకుంటున్నాడో తెలుసుకోవాలని వచ్చాడు. కానీ, నేను మాట్లాడలేదు’ అని చెప్పుకొచ్చాడు.