//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

‘గ్యాంగ్’ సినిమా రివ్యూ

Category : movies

నటీనటులు : సూర్య, కీర్తి సురేష్, రమ్య కృష్ణ ఆర్.జే బాలాజీ, శివ శంకర్ మాస్టర్, సుధాకర్ తదితరులు

దర్శకత్వం : విగ్నేష్ శివన్

నిర్మాత : జ్ఞాల్ వేల్ రాజా

సంగీతం : అనిరుద్

సినిమాటోగ్రఫర్ : దినేష్ కృష్ణన్

ఎడిటర్ : శ్రీకర్ ప్రసాద్

తమిళ హీరోలందరితో పోలిస్తే సూర్యకు తెలుగునాట క్రేజ్ ఎక్కువనే చెప్పాలి. అందుకే ఆయన సినిమాలను తమిళ, తెలుగులో ఒకే సారి విడుదల చేస్తుంటారు. తమిళనాట పొంగల్ బరిలోకి దిగిన సూర్య.. తెలుగులోనూ సంక్రాంతి పోటీలోను నిలబడ్డాడు. పవన్ కళ్యాణ్, బాలకృష్ణల సినిమాలతో పోటీ పడుతూ తన ‘గ్యాంగ్’ను దించాడు. విడుదలకు ముందు సినిమాను బాగా ప్రచారం చేయడంతో అంచనాలు పెరిగాయి.

కథ:

తిలక్ (సూర్య) ఎప్పటికైనా సీబీఐ ఆఫీసర్ కావాలని కల కంటుంటాడు. మొత్తానికి ప్రయత్నం ఫలించి ఇంటర్వ్యూ వరకు వెళ్తాడు. కానీ ఇంటర్వ్యూలో తనకు అవమానం జరుగుతుంది. మరోవైపు పోలీస్ కావాలనుకున్న తన స్నేహితుడు లంచం చెల్లించలేక ఆత్మహత్య చేసుకుంటాడు. ఈ విషయాలతో చలించిపోయిన తిలక్ మరికొంతమందితో కలిసి ఒక గ్యాంగ్‌గా ఏర్పడి సీబీఐ, ఇన్‌కంటాక్స్ ఆఫీసర్లుగా వేషాలు వేసుకొని తమ దందా మొదలుపెడతారు.

నల్లధనం ఎక్కువగా ఉండే కొందరు ప్రముఖులను టార్గెట్ చేసి, ఇళ్ల లో రైడ్ చేసి వారి వద్ద ఉన్న మొత్తాన్ని కొట్టేస్తుంటారు. అది బ్లాక్ మనీ కావడంతో ఎవరూ వీరి పై ఫిర్యాదు చేయరు. తిలక్ అండ్ టీమ్ చేసే పనులు సీబీఐకి తలనొప్పిగా మారతాయి. దీంతో అసలైన సీబీఐ ఆఫీసర్ శివశంకర్(కార్తీక్) ఇదంతా ఎవరు చేస్తున్నారో తెలుసుకోవాలని అనుకుంటాడు. మరి శివశంకర్.. తిలక్ గ్యాంగ్‌ను పట్టుకున్నాడా..? ఆ బ్లాక్ మనీ మొత్తాన్ని ‘గ్యాంగ్’ ఏం చేసింది..? అనే విషయాలు సినిమా చూసి తెలుసుకోవాల్సిందే!

విశ్లేషణ:

బాలీవుడ్‌లో మూడేళ్ల క్రితం విడుదలైన ‘స్పెషల్ 26’ సినిమాకు రీమేక్‌గా ఈ సినిమాను తెరకెక్కించారు. దర్శకుడు విఘ్నేష్ శివన్ మాత్రం కథలో చాలా మార్పులు చేసినట్లు చెప్పాడు. కానీ సినిమాలో మాత్రం అలాంటి మార్పులేవీ కనిపించవు. అవినీతి కారణంగా తను అనుకున్న దాన్ని సాధించలేకపోయిన ఒక సామాన్య వ్యక్తి దొంగగా మారి తనలా ఇబ్బంది పడే వారికి డబ్బు సహాయం చేస్తుంటాడు. ఇదే కాన్సెప్ట్‌తో సినిమా మొత్తం నడుస్తుంది.

అయితే నకిలీ సీబీఐ అధికారుల్లా వేషాలు వేసుకొని రైడ్ చేసే సన్నివేశాలను మరింత ఉత్కంఠభరితంగా చూపించి ఉంటే బాగుండేది. సినిమాలో మొదటి రైడింగ్ సన్నివేశం తప్ప మిగిలినవేవీ పెద్దగా ఆకట్టుకోవు. మూడు పాటలు, రెండు దొంగతనాలతో ఫస్ట్‌హాఫ్‌ను ముగించారు. ఇక సెకండ్ హాఫ్‌లో పోలీసుల నుంచి తప్పించుకోవడానికి హీరో టీమ్ వేసే ప్లాన్లతో సినిమా చాలా రొటీన్‌గా సాగింది.

ప్రీక్లైమాక్స్ వచ్చేసరికి సినిమాపై ఆసక్తి పెరుగుతుంది. పతాక సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. అయితే ‘స్పెషల్ 26’ సినిమా చూసిన వారికి మాత్రం ఈ సినిమా పెద్దగా రుచించదు. కథకు తగ్గట్లుగా బలమైన స్క్రీన్ ప్లే, సన్నివేశాలను గనుక రాసుకొని ఉంటే సినిమా మరో స్థాయిలో ఉండేది.

నటీనటులు :

హీరో సూర్య మాత్రం తన పాత్రలో ఇమిడిపోయారు. తన నటనే సినిమాకు ఎసెట్. రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో బాగా నటించాడు. హీరోయిన్ కీర్తి సురేష్ పాత్రను కేవలం పాటల కోసం ఇరికించినట్లుగా ఉంది. నటనకు పెద్దగా స్కోప్ లేదు. ఇక సినిమాలో మరో ముఖ్యమైన పాత్రలో రమ్యకృష్ణ కనిపించారు. గ్యాంగ్‌లో మెంబర్‌గా ఆమె పెర్ఫార్మన్స్ మెప్పిస్తుంది.

సీబీఐ ఆఫీసర్‌గా సీనియర్ హీరో కార్తీక్ చక్కటి నటనను కనబరిచారు. బ్రహ్మానందం కామెడీ పండలేదు. టెక్నికల్‌గా సినిమా అంతంత మాత్రంగానే ఉంది. అనిరుధ్ అందించిన బాణీలు, నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తాయి. ఈ సంక్రాంతి సెలవుల్లో కాలక్షేపం కోసం ఈ సినిమాను చూడొచ్చు.

INS మీడియా రేటింగ్ : 3 / 5

By - భార్గవ్ చాగంటి