అందరికీ ధన్యవాదాలు. మీ అందరితో నేనో ఆలోచన పంచుకోవాలనుకుంటున్నా. ఎన్నో పగళ్లు రాత్రుళ్లు ఈ ఆలోచన నాతో ఉంది. ఎక్కడికెళ్లినా ఓ అదనపు బరువులా నాతో ప్రయాణించింది. సాధన చేస్తున్నా.. ఆడుతున్నా.. భోజనం చేస్తున్నా.. మైదానంలో, డ్రెస్సింగ్ రూమ్‌లో, ఇంట్లో అన్నింటా నాతోనే ఉంది. నెట్స్‌లో నాకు బంతులు విసిరే బౌలర్లా వెంటాడింది. ఆఖరి నా భోజనాన్ని భయంకరంగా మార్చేసింది.
టీమిండియా, దిల్లీ, కేకేఆర్, డీడీ దేనికి ఆడినా ఈ ఆలోచన నాతో ప్రయాణించింది. ప్రతిసారీ గౌతీ నీ ఆట ముగిసిందని చెప్పింది. 2014 ఐపీఎల్లో వరుసగా మూడు సార్లు డకౌటైనప్పుడు నా చెంప చెళ్లుమనిపించింది.
అదే ఏడాది ఇంగ్లాండ్ పర్యటనలో, మళ్లీ 2016లో కష్టాల్లో పడిపోయాను. రాజ్‌కోట్‌లో ఇంగ్లాండ్ టెస్టులో నన్ను తప్పించారు. అప్పుడు నా ఆత్మవిశ్వాసాన్ని వెతుక్కుంటూ వెళ్లాను. గౌతీ నీ పనైపోయిందని అభిమానుల అరుపుల్లో విన్నాను. కానీ నా ఆట ముగియలేదని గట్టిగా ప్రతిఘటించాను. మళ్లీ నా దేహాన్ని తీవ్రంగా కష్టపెట్టాను. నా వ్యక్తిగత అరిచినప్పుడు నాపై నాకే కోపం వచ్చింది. దివాళా తీసినట్టు అనిపించింది. అలాంటి కష్ట సమయాల్లో మీ ఆదరాభిమానాలే నన్ను తట్టి లేపాయి. మళ్లీ గెలవాలనుకున్నా. పట్టు సాధించాలని నిర్ణయించుకున్నా.
2017 రంజీ సీజన్లో బాగా పరుగులు చేశాక నాకిష్టమైన దిల్లీ డేర్‌డెవిల్స్‌కు ఎంతో ఆత్మవిశ్వాసంతో వచ్చా. నా ఆట బాగుండటంతో ‘గౌతీ నీ ఆట ముగిసింది’ అన్న అరుపులు ఉండవనుకున్నా. అయితే నేను తప్పని తేలింది. దిల్లీ తరఫున వరుసగా ఆరు మ్యాచుల్లో నా ప్రదర్శన బాలేదు. ఈ సారి ఆ వ్యతిరేక అరుపులు మరింత బిగ్గరగా వినిపించాయి. ఇక నిజంగానే నా సమయం ముగిసిందనుకున్నా. అవును..!
15 సంవత్సరాలకు పైగా క్రికెట్లో ఉన్నాను. దేశానికి ప్రాతినిథ్యం వహించాను. ఇక ఈ అందమైన ఆటకు వీడ్కోలు పలకాలని నిర్ణయించుకున్నా. ఎన్నో భయాలు, బాధలు, కష్టాలు, నొప్పులున్నా మళ్లీ దేశం తరఫున ఆడాలనుకున్నా. శతకాలు చేయాలన్న కోరికలు నెరవేరుతాయని ఆశించా. రెండు ప్రపంచకప్ టోర్నీలు, రెండు కీలక ఫైనళ్లలో టాప్ రన్గెట్టర్గా నిలిచాను. నా కలలు నెరవేరాయి. మీ అందరి కోసం ప్రపంచకప్ గెలవాలన్న నా కల నెరవేరింది.
నా ప్రయణంలో ఎన్నో అర్థవంతమైన భాగస్వామ్యాలు ఉన్నాయి. అవి మీతోనే. అభిమానులతోనే. మీరే భారత్‌కు నిజమైన మద్దతుదారులు. అందుకే మిమ్మల్ని భాగస్వాములుగా పిలుస్తాను. అసలైన క్రికెటర్లను మీరే తయారుచేశారు. మీరు లేకుంటే భారత క్రికెట్‌కు దేహం లేనట్టే. నా కోల్‌కతా భాగస్వాములకు ప్రత్యేక అభినందనలు. నా ప్రేమ ఎప్పటికీ వారితో కొనసాగుతుంది.