ఇండియన్ ప్రీమియర్ లీగ్ 11వ సీజన్లో ఢిల్లీ డేర్ డెవిల్స్ కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు గౌతమ్ గంభీర్ ప్రకటించాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యం అధికారిక ప్రకటన చేసింది. గంభీర్ స్థానంలో శ్రేయస్ అయ్యార్కి కెప్టెన్ బాధ్యతలు అప్పగిస్తున్నట్లు పేర్కొంది.
ఇది నా నిర్ణయమే, జట్టు కోసం నేను ఊహించినంత కృషి చేయలేదు. ఒక లీడర్‌గా నేను ఆ బాధ్యతను తీసుకోవాలి. అందుకు ఇదే సరైన సమయం అని గంభీర్ మీడియా సమావేశంలో తెలిపాడు. సీజన్లో ఆరు మ్యాచ్‌లు ఆడిన ఢిల్లీ జట్టు కేవలం ఒక మ్యాచ్‌లో మాత్రమే విజయం సాధించి పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది.
దీనికి పూర్తి బాధ్యత తానే స్వీకరిస్తున్నట్లు గంభీర్ స్పష్టం చేశాడు. జట్టు ఓటములకు పూర్తి బాధ్యత నాదే. జట్టు ఇప్పుడున్న స్థానం చూసి నేను కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నా. మిగితా సీజన్ మొత్తం శ్రేయస్ ఆ బాధ్యతలు తీసుకుంటాడు. టీం ఈ వైఫల్యం నుంచి బయటపడుతుంది అని అనుకుంటున్నా అని తెలిపాడు.
ఏడు సీజన్లు కోల్‌కతా నైట్‌రైడర్స్ జట్టుకి కెప్టెన్‌గా ఉన్న గంభీర్ ఆ జట్టుని 2012, 2014 సీజన్లలో విజేతగా నిలిపాడు. కానీ ఈ ఏడాది మాత్రం అతన్ని అట్టిపెట్టుకోవడంతో ఫ్రాంచైజీ ఆసక్తి చూపలేదు. దీంతో ఢిల్లీ గూటికి చేరిన గంభీర్‌కు ఫ్రాంచైజీ కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించింది. కానీ టాప్ ఆర్డర్ బ్యాట్స్‌మెన్ అయిన గంభీర్ ఊహించనంతగా రాణించలేదు. ఆరు మ్యాచ్‌ల్లో 96.59 స్ట్రైక్ రేటు, 17 సగటుతో 85 పరుగులు మాత్రమే చేశాడు.