//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సంచలన వ్యాఖ్యలు చేసిన ఎంపీ గల్లా జయదేవ్...!

Category : politics

లోక్ సభలో టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్ నిన్న విశ్వరూపం చూపించారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మిస్టర్ ఫైనాన్స్ మినిస్టర్ లోక్ సభ వేదిక నుంచి మిమ్మల్ని డిమాండ్ చేస్తున్నా విభజన హామీలన్నీ నెరవేరుస్తామన్న మీరు, వాటిని ఎందుకు అమలు చేయలేదో చెప్పాల్సిన అవసరం ఉందంటూ తీవ్ర స్వరంతో మాట్లాడారు. 14 నిమిషాల పాటు ఆంగ్లంలో అనర్గళంగా ప్రసంగించిన ఆయన బీజేపీపై విరుచుకుపడ్డారు.

ప్రభుత్వం ఏర్పడి నాలుగేళ్లు అవుతున్నా, ఏపీకి మీరు చేసింది ఏమిటని సూటిగా ప్రశ్నించారు. మిస్టర్ ప్రైమ్ మినిస్టర్, మీ సంకీర్ణ భాగస్వాములకు మీరు ఎలాంటి సందేశాన్ని పంపాలనుకుంటున్నారు.

వైసీపీ నేతలు కేంద్ర బడ్జెట్ పై ప్రశంసలు కురిపిస్తున్నారని బీజేపీతో కలిసేందుకు ఉత్సాహం చూపిస్తున్నారని కేంద్రం చేసిన అన్యాయానికి టీడీపీ ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారని గల్లా అన్నారు. కేంద్రంలో ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి భజన చేయడం వైసీపీ నైజమని చెప్పారు.

తమ ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నాలుగేళ్లలో ఢిల్లీకి 29 సార్లు వచ్చి ప్రధానిని, ఇతర కేబినెట్ మంత్రులను కలిశారని, రాష్ట్రానికి న్యాయం చేయాలని కోరుతూ సమగ్ర నివేదికలు అందించారని అయినా, వాటన్నింటినీ బుట్టదాఖలు చేశారని గల్లా మండిపడ్డారు. సాంకేతిక సమస్యల కారణంగా ప్రత్యేక హోదా కుదరదని మీరు చెబితేనే, తాము ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నామని చెప్పారు.

మిత్రపక్షాలుగా కలసి ఎన్నికలకు వెళ్లాం కాబట్టే నాలుగు బడ్జెట్ ల నుంచి వేచి చూస్తున్నామని చెప్పారు. ఇకపై ఆ అవకాశం లేదని ఇదే చివరి పూర్తి స్థాయి బడ్జెట్ అని, ఇప్పుడు మీరు ఏమీ చేయలేకపోతే మాకు అన్యాయం చేసినవారు అవుతారని తెలిపారు.

లోక్ సభలో మీకు సంఖ్యాబలం ఎక్కువగా ఉందనే భావనలో మీరు ఉన్నారని అయితే వేగంగా మారుతున్న సమీకరణాల నేపథ్యంలో, రానున్న రోజుల్లో ఏదైనా జరుగుతుందని హెచ్చరించారు. ఇచ్చిన హామీలను నెరవేర్చక పోతే ప్రజలు చూస్తూ ఊరుకోబోరని అన్నారు.

Related News