//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అసహనం, అత్యుత్సాహం ఇవే రోడ్డు ప్రమాదాలకు ముఖ్య కారణాలా ?

Category : national state editorial

అసహనం

హర్ష ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్, అమీర్ పేట్ నుంచి హైటెక్ సిటీ కి వెళ్తున్నాడు , యూసఫ్ గూడ సిగ్నల్స్ దగ్గరికి రాగానే విపరీతమైన ట్రాఫిక్ జామ్. తీరా చూస్తే అక్కడ ఎన్నో వాహనాలు ఉండవు. ఉన్న కొన్ని ఆటోలు రోడ్డు మీద ఆపి ప్రయాణికులతోబేరసారాలు. సిటీ బస్సులు నడిరోడ్డుమీద ఆపి ప్రయాణికులను దించడం ఎక్కించుకోవడం లాంటివి చేస్తుంటాయి.ఇంకా కొంత మంది రాంగ్ రూట్ లో వెళ్లడం. వీటి నియంత్రణ కి ట్రాఫిక్ పోలీస్ లేడా అంటే ఉన్నాడు ఎదో ఓ మూలాన నుంచొని ఫోన్ చూస్తుండటమో లేక ఎవరు హెల్మెట్ పెట్టుకోలేదా అని వెతుకుతూ, ఫోటో తీసి పై అధికారులు ఇచ్చిన టార్గెట్ చేరుకున్నామా లేదా ఇదే అతనికి ముఖ్యమైన విషయం .

ఈ ట్రాఫిక్ లో చిక్కుకొని తన కార్యాలయానికి వెళ్లవలిసిన సమయానికి వెళ్తానా లేదా అని హర్షకి ఆందోళన మొదలైంది. అంతే కాకుండా ఆ ఆటో వాళ్ళ మీద, సిటీ బస్సు మీద , రాంగ్ రూట్ లో వచ్చే వాళ్ళ మీద మరీ ముఖ్యంగా అక్కడే నుంచుని చోద్యం చూస్తున్న ట్రాఫిక్ పోలీస్ మీద విపరీతమైన కోపం వచ్చాయి. ఈ వ్యవస్థ ఏమి చేయలేక అతని కోపం అసహనం గా మారింది. అది మానవ సహజం. ఒక్కసారి ఆ ట్రాఫిక్ జామ్ దాటగానే అతను అదే ఆలోచిస్తూ తనకు తెలియకుండానే వాహనాన్ని అధిక వేగంతో నడుపుతాడు. ఎవడో ఒకడు ఈ మధ్యలో రాంగ్ రూట్ లో రావడమో లేక నడిరోడ్డు మీద పెద్ద గుంత ఉండటమో(ఆ గుంత అంతకు ముందు ఉండదు ముందు రోజు రాత్రే ఎవడో త్రవ్వుతాడు) జరుగుతుంది . ఇంకేముంది హర్ష చేరుకునేది యమపురికో లేదంటే కాలో చెయ్యో విరిగి ఆసుపత్రి కో. పోలీస్ లు వచ్చి అధిక వేగం వల్ల జరిగింది అని ఒక ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకుంటారు.అంతే కానీ ఇలా అధిక వేగంగా ఎందుకు వెళ్ళవలసి వస్తుంది అనే కోణం లో మాత్రం ఆలోచించరు.

కానీ 100 కి 90 మందికి ఇలా అధిక వేగంగా వెళ్లాలనే సరదా ఉండదు. కానీ తప్పని పరిస్థితులలో తమ అదుపులో లేని కారణాలతో వారికి తెలియకుండానే ఎంతో మంది ఈ విధముగా ప్రాణాలు కోల్పోతున్నారు. ప్రపంచ వ్యాప్తముగా ప్రజలను అసహనానికి గురి చేస్తున్న విషయం అవినీతో ఇంకా మరేదో కాదు, ట్రాఫిక్ జామ్. అవును ఈ ట్రాఫిక్ జామ్ లు ఎంతో విలువైన సమయాన్ని వృధా చేసి, మనకి తెలియకుండానే మనలో ఎంతో కోపాన్ని అసహనాన్ని కలిగిస్తున్నాయి. తద్వారా ఎన్నో రోడ్డు ప్రమాదాలకు మనకు తెలియకుండానే కారణమవుతున్నాయి. ట్రాఫిక్ నియంత్రణ సరిగా చేస్తే చాలు మనం ఎంతో మంది విలువైన ప్రాణాలు కాపాడవచ్చు.

అత్యుత్సాహం

మోహన్ ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్. ఈ మద్యే కొత్తగా ఒక అధిక సామర్థ్యం గల బైక్ కొన్నాడు. అతనికి డ్రైవింగ్ బాగానే వచ్చు. కానీ ఒకరోజు రాత్రి తన స్నేహితులతో కలసి బంజారా హిల్స్ లో రోడ్ లో వెళ్తున్నాడు. ఎవరు ఉండరు కదా అని తన డ్రైవింగ్ నైపుణ్యాన్ని ప్రదర్శిస్తున్నాడు. అధిక వేగం తో వెళుతూ రోడ్డు మీద అడ్డదిడ్డంగా నడుపుతున్నాడు . ఒక్క సారిగా అతని ముందు సందులోంచి ఎదో వాహనం రోడ్డు మీదకి వచ్చింది. ఇంకేముంది బైక్ అదుపు తప్పడం రోడ్ డివైడర్ ని ఢీ కొనడం. అతని స్నేహితుల ఆర్తనాదాలు. ఒక్కోసారి ఇటువంటి వాళ్ళ అత్యుత్సాహం వల్ల అన్ని జాగ్రత్తలు తీసుకొని వాహనం నడిపే వాళ్ళు కూడా ప్రమాదానికి లోనయ్యిన సంఘటనలు మనం వినే ఉంటాం.

అసహనం ఐన , అత్యుత్సాహం ఐన మన నియంత్రణ లో లేకుంటే ప్రక్క వారి ప్రాణాలకే కాదు, మన ప్రాణాలకు కూడా ఆపద వచ్చినట్లే.

పోలీస్ లు కూడా తమకు కనిపించే కారణాలే కాకుండా , కంటికి కనిపించని ఇటువంటి వాటిపై పరిశోధించి ఇవి నివారించడానికి చర్యలు చేపట్టాలి.