ఆదివారం నుండి ఆరంభం కానున్న ప్రెంచ్ ఓపెన్ కు డ్రా ను శుక్రవారం ప్రకటించారు. ఈ డ్రా ప్రకారం మాజీ ప్రత్యర్థులైన నొవాక్ జొకోవిచ్, రఫెల్ నాదల్‌లు సెమీఫైనల్లోనే తలపడే అవకాశముంది. అంటే ఫైనల్ కి ముందే ఆసక్తికర సమరం జరగనుంది. ఈ మట్టికోర్టు గ్రాండ్‌స్లామ్‌లో 9సార్లు విజేత అయిన నాదల్ తొలిరౌండ్లో స్థానిక ఆటగాడు బెనోయిట్ పెయిరెతో తలపడనుండగా, ఢిపెండింగ్ ఛాంపియన్ జొకోవిచ్ ఈసారి ఆరంభరౌండ్లో మార్సెల్ గ్రానోల్లర్స్ (స్పెయిన్)తో తలపడుతున్నాడు.
గత కొంతకాలంగా గాయంతో బాధపడుతూ ఆటలో వెనుకబడ్డ నాదల్ ఇప్పుడు పూర్తి ఫిట్‌గా ఉంటూ వరుస విజయాలతో మంచి జోరుమీద ఉన్నాడు.మట్టికోర్టులో గ్రాండ్‌స్లామ్ ల సంఖ్యను 10 కి పెంచుకోవాలని ఉవిళ్లూరుతున్నాడు. రష్యా ఆటగాడు ఆండ్రీ కుజ్నెత్సోవ్తో తొలిరౌండ్ ఆడనున్న టాప్‌సీడ్ ఆండీ ముర్రేకు సెమీస్‌లో 2015 విజేత స్టానిస్లాస్ వావింక్రా ఎదురుపడే చాన్సుంది. ఇక మహిళల సింగిల్స్‌లో టాప్‌సీడ్ కెర్బర్‌కు ఫైనల్ చేరే క్రమంలో డిఫెండింగ్ చాంపియన్ గార్బినె ముగురుజా నుంచి సవాల్ ఎదురవనుంది. ఒకే పార్శంలోనున్న ఈ ఇద్దరి మధ్య సెమీస్ ఫైట్ జరిగే అవకాశాలున్నాయి. కెర్బర్ తొలిరౌండ్లో మకరోవా (రష్యా)తో ఆడనుంది. మరో పార్శం నుంచి రెండోసీడ్ కరోలినా ప్లిస్కోవాతో 2014 రన్నరప్ హాలెప్ తలపడే చాన్సుంది.