భారత టెన్నిస్ స్టార్ రోహన్ బోపన్న తొలి గ్రాండ్‌స్లామ్‌ను సాధించాడు. ఏడో సీడ్ రోహన్ బోపన్న కెనడా భామ గాబ్రియేల్ దబ్రోస్కిల జోడి ఫ్రెంచ్ మిక్స్డ్ డబుల్స్ విజేతగా అవతరించారు. గంటా ఆరు నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఉత్కంఠ భరిత ఫైనల్లో అన్‌సీడెడ్ జోడి రోబర్ట్ ఫరా(కొలంబియా), అన్నా లీనా గ్రోన్ఫీల్డ్ (జర్మనీ)పై 2-6, 6-2,12-10తో జయభేరి మోగించారు.
ఏడో సీడ్‌గా బరిలో దిగిన గాబ్రియేల్, బోపన్నలు తొలి సెట్ 2-6 కోల్పోయారు. ఈ దశలో ఏ మాత్రం అధైర్య పడకుండా రెండో సెట్లో విజృంభించి ప్రత్యర్థులను 6-2తో ఓడించి సమ ఉజ్జీలుగా నిలిచారు. విజేత నిర్ధారించే సూపర్ టై బ్రేకర్లోను నువ్వానేనా అన్న రీతిలో పోరు సాగింది.
తొలుత బోపన్న జంట 3-0 ఆధిక్యం నుంచి 3-5కు పడిపోయింది. తర్వాత హాఫ్ వాలీ షాట్లతో ప్రత్యర్ధికి షాక్ ఇచ్చి 5-5 ఆధిక్యంలో చేరారు. ఒకానొక దశలో 10-10తో సమానంగా నిలిచిన తరుణంలో బోపన్న ద్వయం వరుసగా రెండు పాయింట్లను సాధించి టైటిల్‌ను ఖాతాలో వేసుకుంది.
దీంతో భారత్ నుంచి తొలి గ్రాండ్‌స్లామ్ సాధించిన నాలుగో టెన్నిస్ క్రీడాకారుడిగా 37 ఏళ్ల బెంగళూరు టెన్నిస్ స్టార్ బోపన్న రికార్డులకెక్కాడు. లియాండర్ పేస్, మహేష్ భూపతి, సానియా మీర్జా తర్వాత తొలి టైటిల్‌తో బోపన్న వారి సరసన నిలిచాడు.
దాదాపుగా ఏడేళ్ల తర్వాత అతను ఫ్రెంచ్ ఓపెన్ ద్వారా గ్రాండ్ స్లామ్ ఫైనల్‌కు చేరాడు. 2010లో యూఎస్ ఓపెన్‌లో పాక్ భాగస్వామి ఖరేషితో కలిసి ఫైనల్‌కు బోపన్న చేరాడు. ఇక్కడ టైటిల్ రేసులో అమెరికా కవల ద్వయం బాంబే, మైక్ బ్రయాన్ చేతిలో పరాజయం పాలయ్యాడు.