ఒకే ఒక్క విజయం పాతికేళ్ల ఎదురు చూపులకు చరమగీతం పాడనుంది. దక్షిణాఫిక్రా గడ్డపై పరాభవాలకు సమాధానం ఇవ్వనుంది. ఎంతో మంది ఆటగాళ్లు కన్న కలలను సాకారం చేయనుంది. సఫారీ నేలపై ఇప్పటిదాకా అందకుండా ఊరిస్తున్న వన్డే సిరీస్ విజయం కోసం భారత జట్టు కేవలం ఒక్క మ్యాచ్ దూరంలోనే ఉంది.
ప్రత్యర్థి వెన్నులో గుబులు పుట్టిస్తున్న కోహ్లీ సేన ఇప్పటికే 3-0తో స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. అందుకే మరో విజయం చాలు జట్టు చిరస్మరణీయ క్షణాలను ఆస్వాదించేందుకు అభిమానులు సగర్వంగా తలెత్తుకునేందుకు ఇదే లక్ష్యంతో చరిత్రలో మైలురాయిలా నిలిచే గెలుపు కోసం నేడు జరిగే నాలుగో వన్డేలో భారత్ బరిలోకి దిగనుంది. ఈ విజయంతో భారత జట్టు ఖాతాలో నెంబర్‌వన్ ర్యాంకు కూడా వచ్చి చేరుతుంది.
ఇక అన్ని విభాగాల్లో బలహీనపడిన దక్షిణాఫ్రికాకు డివిల్లీర్స్ ఆశాకిరణంగా మారాడు. ఒంటిచేత్తో మ్యాచ్ స్వరూపాన్ని మార్చి వేయగల సత్తా కలిగిన ఈ స్టార్ బ్యాట్స్‌మన్ ఆఖరి మూడు వన్డేలకు అందుబాటులో ఉండడంతో వారికి ప్రాణాలు లేచి వచ్చినట్టయ్యింది. ఈ మ్యాచ్‌కు ఆతిథ్య జట్టు గులాబీ జెర్సీతో బరిలోకి దిగబోతోంది.
భారత్‌కు ఈ సిరీస్‌కున్న ప్రాముఖ్యం ఏమిటో బాగానే తెలుసు. అందుకే హ్యాట్రిక్ విజయాలు సాధించినా ఎలాంటి ఏమరుపాటులో లేమని ఓపెనర్ ధవన్ ఇప్పటికే స్పష్టం చేశా డు. ఈ మ్యాచ్‌కూ జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. బ్యాటింగ్‌లో కోహ్లీ అదరగొడుతున్నాడు. ఇప్పటికే రెండు సెంచరీలతో హోరెత్తించాడు. ధవన్ ఫామ్ సరేసరి.