తండ్రీ కొడుకులు క్రికెట్ ఆడటం కొత్తేమీ కాదు. కొందరైతే కలిసి ఒకే మ్యాచ్ ఆడిన సందర్భాలు ఉన్నాయి. దేశవాళీ క్రికెట్లో ఒకే జట్టుకు కలిసి ప్రాతినిధ్యం వహించడాన్ని మనం చూశాం..! త్వరలో న్యూజిలాండ్‌లో జరిగే అండర్-19 క్రికెట్ ప్రపంచకప్‌లో మాజీ స్టార్ క్రికెటర్ల కుమారులు ఆయా దేశాల తరఫున ఆడనుండటం విశేషం.
ఆస్టిన్ వా.. ఆస్ట్రేలియా మాజీ సారథి స్టీవ్‌వా కొడుకు. 2016లో అండర్-17 జాతీయ ఛాంపియన్‌షిప్‌లో 122 పరుగులతో అజేయంగా నిలిచి వార్తల్లోకి ఎక్కాడు. అలాగే మఖాయ ఎన్తినీ కుమారుడు తండో ఎన్తినీ వెస్టిండీస్‌పై అండర్-19 క్రికెట్లో దక్షిణాఫ్రికా తరఫున అరంగేట్రం చేసి 4/56తో అందరి దృష్టిని ఆకర్షించాడు.
ఆస్టిన్, తండో వారి దేశాల తరఫున అండర్-19 క్రికెట్ ప్రపంచ టోర్నీలో దిగుతున్నారు. టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యలా ఆడటాన్ని ఆస్టిన్ ఇష్టపడతాడు. రాకాసి బౌన్సర్‌కు మైదానంలోనే మృతిచెందిన ఫిల్ హ్యూస్ అంటే అభిమానం. అతడిలా సులువుగా బ్యాటింగ్ చేయడమంటే ఇష్టం.
మైదానంలో విరాట్ కోహ్లీలా దూకుడు కనబరచడం అంటే తండోకు చాలా కోరిక. ఎడమ చేతితో బ్యాటింగ్ చేస్తాడు. కుడిచేత్తో బౌలింగ్ చేస్తాడు.