సింగపూర్ ప్రభుత్వానికి చెందిన సింగపూర్ ఎయిర్‌లైన్స్ అనుబంధ సంస్థ టైగర్ ఎయిర్వేస్ ఇకపై స్కూట్ ఎయిర్‌లైన్స్ బ్రాండ్నేమ్పై సేవలు అందించనున్నది. ఒకే బ్రాండ్‌గా విమాన సేవలు అందించాలనే ఉద్దేశంతో తొమ్మిది నెలల తర్వాత స్కూట్, టైగర్ఎయిర్లను కలిపేసినట్లు కంపెనీ ఇండియా హెడ్ భరత్ మహదేవన్ చెప్పారు. ఈ సందర్భంగా సంస్థ ప్రత్యేక ఆఫర్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సింగపూర్ విమాన టిక్కెట్ ధరను ఒకవైపు రూ.5,599గా నిర్ణయించింది.
దీంతోపాటు హైదరాబాద్-బాలీ మధ్య రూ.11,799గాను, హైదరాబాద్-హాంకాంగ్ మధ్య రూ.11,199, హైదరాబాద్-మెల్బోర్న్ మధ్య రూ.12,499, హైదరాబాద్-సిడ్నీల మధ్య టిక్కెట్ ధరను రూ.13,099గా నిర్ణయించింది. వచ్చేనెల 6లోగా బుక్ చేసుకున్న టిక్కెట్లకు మాత్రమే ఈ ఆఫర్ వర్తించనున్నది. ప్రస్తుతం సంస్థ హైదరాబాద్‌తోపాటు బెంగళూరు, కొచి, తిరుచిరాపల్లి, లక్నోలకు విమాన సేవలను అందిస్తున్నది.
వచ్చే ఏడు నుంచి ఎనిమిదేండ్ల కాలంలో హైదరాబాద్ నుంచి అంతర్జాతీయ మార్గాల్లో రోజుకు 12-15 విమాన సర్వీసులను నడుపాలనుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్-సింగపూర్ల మధ్య రోజువారీ సర్వీసును నడుపుతున్నది.
దేశీయ ప్రయాణికులను ఆకట్టుకోవడానికి కంపెనీ అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నదని, దీంట్లో భాగంగా పలు రాష్ర్టాల టూరిజం శాఖలతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నట్లు ఆయన ప్రకటించారు. ఇప్పటికే రాజస్థాన్ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు తుది దశకు చేరుకున్నాయన్నారు. అలాగే తెలంగాణతోపాటు ఏపీ, గుజరాత్ టూరిజం కార్పొరేషన్లతో కూడా చర్చలు జరుపుతున్నట్లు చెప్పారు.