Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ప్రైస్‌వాటర్‌ కూపర్స్‌ ఆడిటింగ్ పై అభ్యంతరం

Category : national

నరేంద్ర మోడీ ప్రభుత్వపు కీలక ప్రాజెక్టులైన నల్లధనంపై దర్యాప్తు, డిజిటల్‌ ఇండియా, మేక్‌ ఇన్‌ ఇండియా, స్మార్ట్‌ సిటీస్‌ ప్రాజెక్టుల ఆడిటింగ్‌ వ్యవహారాలను చూసేందుకు నియమించిన ప్రైస్‌వాటర్‌ కూపర్స్‌ (పిడబ్ల్యుసి) ఇండియా నిజాయితీని సిటిజన్స్‌ విజిల్‌బ్లోయర్స్‌ ఫోరం  ప్రశ్నించింది. తమ సమాచార వ్యవస్థలను ఆడిట్‌ చేయడంలో పిడబ్ల్యుసికి రిజర్వు బ్యాంకు సహాయ పడటంపై కూడా సిడబ్ల్యుఎఫ్‌ ఆందోళన వ్యక్తం చేసింది.

పిడబ్ల్యుసి సొంత ఖాతాలలోనే అనేక తప్పులు వెలుగు చూశాయి.  వివిధ కంపెనీల తరుఫున ఆడిట్‌ నివేదికలను తప్పుగా దాఖలు చేసింది. సత్యం, గ్లోబల్‌ ట్రస్ట్‌ బ్యాంక్‌ (జిటిబి), విజయమాల్యా కంపెనీలతో సహా పలు ప్రధాన కుంభకోణాలతో ప్రమేయమున్న కంపెనీల ఆడిట్‌ నివేదికలను కూడా తప్పుగా చూపినట్లు ఆరోపణలున్నాయి.

అంతకుముందు సంయుక్త పార్లమెంటరీ కమిటీ కూడా పిడబ్ల్యుసిని నేరస్తురాలిగా పరిగణించిందని ఫోరమ్ సభ్యులు, ప్రముఖ న్యాయవాది ప్రశాంత్‌ భూషణ్‌ గుర్తు చేశారు. పలు తప్పుడు పనులకు, నేరాలకు పాల్పడుతున్న కంపెనీ సేవలనే మోడీ ప్రభుత్వం కొనసాగించడంపై ఆయన అభ్యతరం వ్యక్తం చేశారు. 

తమ అధికారులను జైళ్ళకు పంపి, వేలాది కోట్ల రూపాయలను జరిమానా విధింపచేసే కంపెనీల కన్నా తమకు లొంగి ఉండే కంపెనీలనే మోడీ ప్రభుత్వం కోరుకుంటున్నదని ఆయన ఆరోపించారు. ఆర్‌బిఐ కూడా ఆడిట్‌లు నిర్వహించేందుకు పిడబ్ల్యుసి సమాచార వ్యవస్థలను వాడుకోవడంపై ప్రశాంత్‌భూషణ్‌ ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్‌బిఐకి చెందిన అత్యంత రహస్య సమాచారాలు కూడా వారి పరిథిలోకి వెళ్ళిపోయే అవకాశ ముందని హెచ్చరించారు. 

నల్లధనం ఎలా సృష్టించబడుతుందో పిడబ్ల్యుసికి తెలుసు కనుకనే ప్రభుత్వం ఆ కంపెనీని ఎన్నుకుని ఉండవచ్చునని సిడబ్ల్యుఎఫ్‌కు చెందిన మరో సభ్యులు జగదీప్‌ ఛోకర్‌ తెలిపారు. మంచి, చెడులను పరిగణిస్తే దాని నుంచి సలహా తీసుకునే నైతిక హక్కు ప్రభుత్వానికి లేదన్నారు.