//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

భగ్గుమన్న ఆహార పదార్ధాల ధరలు...పైకెగిసిన ద్రవ్యోల్భణం

Category : national

గడిచిన కొన్ని నెలలుగా తగ్గుముఖం పట్టిన పలు ఆహార పదార్థాల ధరలు భగ్గుమనడంతో ద్రవ్యోల్బణ గణాంకాలు ఎగువముఖం పట్టాయి. జూలై నెలకుగాను రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ 2.36 శాతంగా నమోదైంది. చక్కెర, మిఠాయి, పాన్, తంబాకు, మత్తుపదార్థాలు ప్రియంకావడంతో గడిచిన నెలలో రిటైల్ ద్రవ్యోల్బణ సూచీ పుంజుకోవడానికి కారణమైందని కేంద్ర గణాంక శాఖ వెల్లడించింది. అయినప్పటికీ ఆహార ద్రవ్యోల్బణం -0.29 శాతంగా నమోదవడం విశేషం. జూన్ నెలకుగాను సూచీ -2.12 శాతంగా ఉంది.

జూన్ నెలకుగాను విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణ గణాంకాలను 1.46 శాతానికి సవరించింది. జూలైలో చక్కెర, మిఠాయిలు 8.27 శాతం ప్రియమవగా, పాన్, తంబాకు, మత్తుపదార్థాలు 6.39 శాతం చొప్పున అధికమయ్యాయి. గృహ ఖర్చులు 4.98 శాతం చొప్పున పెరుగగా, చమురు, లైట్ సెగ్మెంట్‌కు సంబంధించిన ఉత్పత్తులు 4.86 శాతం బలపడ్డాయి. వీటితోపాటు దుస్తులు, పాదరక్షల ధరలు 4.22 శాతం పెరిగాయి. కానీ పప్పు, ఇతర ఉత్పత్తుల ధరలు భారీగా తగ్గాయి.

వీటితోపాటు కూరగాయల ధరలు -3.57 శాతం తగ్గగా, కోడిగుడ్లు -2.04 శాతం, సుగంధ ద్రవ్యాలు -1.67 శాతం మేర పతనమయ్యాయి. గ్రామీణ ద్రవ్యోల్బణ గణాంకాలు 2.41 శాతంగా నమోదయ్యాయి. ద్రవ్యోల్బణ గణాంకాలు భవిష్యత్తులో మరింత పెరిగే అవకాశం ఉందని ఫిక్కీ ప్రెసిడెంట్ పంకజ్ పటేల్ స్పష్టం చేశారు. పరపతి సమీక్షలో ఆర్బీఐ తీసుకున్న నిర్ణయంతో ప్రైవేట్ రంగంలో పెట్టుబడులు బలహీనంగా ఉన్నాయని చెప్పారు. వచ్చే పండుగ సీజన్ కంటే ముందే సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్లను తగ్గించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

టోకు ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం ఎగువముఖం పట్టింది. గడిచిన ఐదు నెలల్లో తొలిసారిగా జూలైలో 1.88 శాతంగా నమోదైంది. పలు ఆహార పదార్థాల ధరలు తగ్గుముఖం పట్టినప్పటికీ టోకు ధరల ద్రవ్యోల్బణం పెరగడం విశేషం. జూన్‌లో డబ్ల్యూపీఐ సూచీ 0.90 శాతంగా ఉంది. అంతక్రితం ఏడాది ఇదే నెలలో నమోదైన 0.63 శాతంతో పోలిస్తే భారీగా పెరిగింది.

జీఎస్టీ అమలులోకి వచ్చిన తర్వాత ఆహార పదార్థాలు, కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. మార్చి నుంచి తగ్గుముఖం పట్టిన టోకు ధరల సూచీ గడిచిన నెలలో పెరుగుదల కనిపించింది. కూరగాయల ధరల సూచీ 21.16 శాతంగా నమోదవగా, తయారీ ఉత్పత్తుల సూచీ 2.18 శాతానికి పరిమితమైంది. చమురు, విద్యుత్ గణాంకాలు 5.28 శాతం నుంచి 4.37 శాతానికి తగ్గాయి.

కూరగాయలు మినహా మిగతా ఆహార పదార్థాలైన కోడిగుడ్లు, మాంసం, చేపల ద్రవ్యోల్బణం 3.30 శాతంగా నమోదైంది. పండ్ల టోకు ధరల సూచీ 2.71 శాతంగాను, చిరుధాన్యాలు 0.63 శాతంగా ఉంది. చక్కెర ధరల సూచీ రికార్డు స్థాయి 8.44 శాతానికి చేరుకుంది. బంగాళాదుంప ధరలు 42.45 శాతం తగ్గగా, పప్పు దినుసులు 32.56 శాతం, ఉల్లి 9.50 శాతం చొప్పున తగ్గాయి.