ఐసిసి ఛాంపియన్స్ ట్రోఫీలో భారత్‌కు ఘోరపరాజయం పాలైంది. 339 పరుగుల భారీ లక్ష్య ఛేదనలో ఒత్తిడికి తట్టుకోలేక భారత అగ్రశ్రేణి బ్యాట్స్‌మెన్ ఒకరి, తరువాత ఒకరుగా పెవిలియన్‌కు క్యూ కట్టారు. ఓపెనర్ రోహిత్ మొదటి ఓవర్ మూడో బంతికే పరుగులేమి చేయకుండా అవుట్ కావడంతో ప్రారంభమైన వికెట్ల పతనం నిరాటంకంగా సాగింది. 30.3 ఓవర్లలో 158 పరుగులకే భారత్ చేతులెత్తేసింది.
కెప్టెన్ కోహ్లీ 5, ధోనీ 4 పరుగులకే వెనుతిరిగారు. హార్థిక్ పాండ్య (76) మినహా మిగిలిన బ్యాట్స్‌మెన్ ఎవ్వరు కనీస పోరాట పటిమ చూపలేకపోయారు. సైకిల్ స్టాండ్‌లా భారత టీమ్ కుప్ప కూలిన తీరు అభిమానుల్లో తీవ్ర నిరాశను, ఆగ్రహాన్ని కలిగించింది. లండన్ నగరంలో ఓవల్ మైదానంలో మ్యాచ్‌ను ప్రత్యక్షంగా వీక్షించిన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోగా, భారత్‌లోని పలు నగరాల్లో ఆగ్రహంగా స్పందించారు.
కొద్ది రోజుల క్రితం లీగ్ మ్యాచ్‌లో భారత్ చేతిలో ఘోరంగా పరాజయం పాలైన పాకిస్తాన్ జట్టు కీలక సమయంలో సమిష్టిగా రాణించింది. భ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్ అన్ని విభాగాల్లోనూ పాకిస్తాన్ స్పష్టమైన ఆధిక్యతను చూపి ఛాంపియన్‌గా ఆవిర్భవించింది.
పాకిస్థాన్ తొలిసారి ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకుంది. 339 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ ఫైనల్ లో 30.3 ఓవర్లలోనే ఆలౌటై పిచ్ నుంచి వెనుదిరిగింది. పాకిస్థాన్ చేతిలో 180 పరుగుల తేడాతో భారత్ ఓటమి పాలైంది. శిఖర్ ధవన్-21, కోహ్లీ-5 , యువరాజ్ సింగ్ 22, ఎంఎస్ ధోనీ -4, జడేజా-15 పరుగులతోనే సరిపెట్టుకోగా..పాండ్యా 76 పరుగులతో పరువు నిలబెట్టాడు.
ముందుగా పాక్ 50 ఓవర్లలో 4 వికెట్లకు 338 పరుగులు చేసింది. ఫక్హార్ జమాన్ (106 బంతుల్లో 114; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీ చేయగా, అజర్ అలీ (71 బంతుల్లో 59; 6 ఫోర్లు, 1 సిక్స్), హఫీజ్ (37 బంతుల్లో 57 నాటౌట్; 4 ఫోర్లు, 3 సిక్సర్లు) రాణించారు. ఈ మ్యాచ్‌లో భువనేశ్వర్ మినహా భారత బౌలర్లు అట్టర్ ఫ్లాఫ్ అయ్యారు. నాలుగో ఓవర్లో బుమ్రా వేసిన నోబాల్ ఏకంగా పాక్ ఇన్నింగ్స్‌కే ప్రాణం పోసింది.