Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇంట్రెస్టింగ్... ఆ గ్రామ పంచాయితీ అంతా ఆ ఇంట్లోనే

Category : politics state

తెలంగాణలో జరిగిన ముందస్తు పంచాయతీ ఎన్నికల్లో బోలెడన్ని విచిత్రాలు చోటుచేసుకున్నాయి. ఒక్క ఓటుతో ఓడిపోయిన వారు, ఓకే ఓటుతో గెలిచినవారు, ఒకే ఇంట్లో ఇద్దరు గెలిచినవారు ఇలానే కాదు ఏకంగా ఒకే ఇంటి నుండి అయిదుగురు గెలుపొంది ఔరా అనిపించేలా చేసారు. ఇక ఆ ఊర్లో పంచాయతీ అంటే ఆ ఇంట్లోనే అని అందరూ అనుకునేలా చేశారు. ఇది ఎలా సాధ్యం అయింది? ఇంతకీ ఇది ఎక్కడ జరిగింది తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఈ స్టోరీలోకి లుక్కేయండి

.పార్లమెంట్ నుండి గ్రామపంచాయతీ వరకూ ఏ ఎన్నికలొచ్చినా గెలుపు కోసం అభ్యర్ధులు రేయింబవళ్లు కష్టపడతారు. మరోవైపు తమ అభ్యర్థి గెలుపుకోసం కుటుంబసభ్యులు, పార్టీ అభిమానులు తీవ్రంగా కృషి చేస్తుంటారు. ఒకరిని గెలిపించడానికే నానా తంటాలు పడే ఈ పరిస్థితులల్లో ఏకంగా ఓ కుటుంబలోని ఐదుగురిని గెలిపించారు ఆ ఊరి ప్రజలు. కుమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో బోదంపల్లి గ్రామపంచాయతీలో తొలివిడత జరిగిన ఈ వింత అందరినీ తెగ ఆకట్టుకుంటోంది.

కుమురంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండలం బోదంపల్లి గ్రామపంచాయతీలోని పదవులన్నిటినీ ఒకే ఇంటివారు గెలుచుకున్నారు. భర్త సర్పంచ్, భార్య ఉప సర్పంచ్, మిగతా కుటుంబ సభ్యులు వార్డు మెంబర్లు. వినడానికి విడ్డూరంగా ఉన్నా ... తొలి విడుత గ్రామపంచాయతీ ఎన్నికలలో ఓకే ఇంట్లో ఐదుగురు గెలుపొంది పదవులు దక్కించుకున్నారు. బోదంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ మద్దతుగా సర్పంచిగా రెడ్డి శంకర్ గెలుపొందాడు. అతని భార్య రెడ్డి కమల, తల్లి రెడ్డి దుర్గమ్మ, అన్న రెడ్డి భీమయ్య, వదిన రెడ్డి సుశీల వార్డు సభ్యులుగా గెలుపొందారు, బోదంపల్లి గ్రామపంచాయతీలో మొత్తం ఎనిమిది వార్డులు ఉన్నాయి. అందులో ఈ ఇంట్లో నుండి నలుగురు గెలుపొందారు. దాంతో సర్పంచ్ గా గెలుపొందిన శంకర్ భార్య కమలను ఉపసర్పంచ్ గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. బోదంపల్లి గ్రామపంచాయతీ సర్పంచ్, కొన్ని వార్డులు ఎస్టీ రిజర్వుడు స్థానం ఉండటంతో ఈ అవకాశం ఈ ఇంటికి వచ్చింది, ఒకే కుటుంబానికి చెందిన వారు పాలకవర్గంలో కీలక పదవులు దక్కించుకోవడంతో... పంచాయతీ అంతా ఆ ఇంట్లోనే అని గ్రామస్తులు అంటున్నారు.