ఇంగ్లాండ్ తో టీ ట్వంటీ సిరీస్ ని కైవసం చేసుకొని పూర్తీ విశ్వాసం తో ఉన్న టీం ఇండియా ఇప్పుడు వన్డే సిరీస్ కి సిద్ధమౌతోంది. ఏడాది తర్వాత ఇదే సమయంలో ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్ జరగనుంది. ఆ టోర్నీ ముందు అక్కడ భారత్ ఆడనున్న చివరి వన్డే సిరీస్ ఇది.
అక్కడి పరిస్థితులు, పిచ్‌లపై అంచనాకు వచ్చేందుకు ఇదో చక్కటి అవకాశం. అంతేకాదు ఎలాగైనా ఇంగ్లాండ్‌లో టెస్టు సిరీస్ గెలవాలని పట్టుదలగా ఉన్న టీమ్ఇండియా వన్డే సిరీస్ సాధించడం చాలా ముఖ్యం. 2015 ప్రపంచకప్ తర్వాత వన్డేల్లో పూర్తి భిన్నమైన ఆటను ప్రదర్శిస్తున్న ఇంగ్లాండ్ చివరగా పూర్తి సిరీస్ ఓడింది భారత్ చేతిలోనే.
2017 జనవరిలో సొంతగడ్డపై భారత్ సిరీస్‌ను కైవసం చేసుకుంది. ఆ తర్వాత ఒకటి కంటే ఎక్కువ మ్యాచ్‌ల సిరీస్‌ను ఇంగ్లాండ్ కోల్పోలేదు. ఈ మధ్యనే ఆస్ట్రేలియాతో 5 వన్డేల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. ఈ నేపథ్యంలో వన్డే సిరీస్ సొంతం చేసుకుని టెస్టులకు ముందు ఆ జట్టు విశ్వాసాన్ని దెబ్బతీయాలని పట్టుదలగా ఉంది కోహ్లి బృందం.
కోహ్లి నాలుగో స్థానంలో జట్టు కూర్పే టీమ్ఇండియాకు సమస్యగా పరిణమించింది. అద్భుత ఫామ్‌లో ఉన్న రాహుల్‌కు చోటివ్వాలా.. ఇస్తే ఎక్కడ..? అన్నదే ఇప్పుడున్న చిక్కు ప్రశ్న. దీనికి పరిష్కారంగా కెప్టెన్ కోహ్లి తన స్థానాన్ని రాహుల్‌కు ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.
రోహిత్, ధావన్ ఓపెనర్లుగా రావడం ఖాయం! అదే స్థానానికి పోటీపడుతున్న రాహుల్‌ను మూడులో బ్యాటింగ్‌కు పంపాలని జట్టు వ్యూహ బృందం ఆలోచిస్తోంది. అందుకు కోహ్లి ఒక స్థానం దిగి నాలుగులో బ్యాటింగ్ చేసుందుకు సిద్ధమవుతున్నాడు. ఇక రైనా, ధోని, హార్ధిక్‌లు మిడిలార్డర్‌ను పంచుకోనున్నారు. అదనపు పేసర్‌ను జట్టులోకి తీసుకోవాలని భావిస్తే భువనేశ్వర్, ఉమేశ్‌లకు తోడుగా శార్దుల్ లేదా సిద్ధార్థ్ కౌల్ తుది జట్టులోకి ఎంపికకావచ్చు.