//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శాంసన్‌ శతకం..... మోరిస్‌ మోత

Category : sports

పరుగుల వరద పారుతున్న ఐపీఎల్‌-10లో మొదటి సెంచరీ నమోదైంది. పుణె సూపర్‌ జెయింట్‌ తో జరిగిన మ్యాచ్ లో ప్రత్యర్థి బౌలింగ్‌ను తుత్తునియలు చేస్తూ సంజు శాంసన్‌ అలవోకగా సెంచరీ కొట్టేశాడు. ప్రశాంతంగా ఆడుతూ కళాత్మక, కళ్లు చెదిరే షాట్లతో మూడంకెల స్కోరును దాటేశాడు. క్రిస్‌ మోరిస్‌ కేవలం తొమ్మిదే తొమ్మిది బంతులాడి విధ్వంసం సృష్టించడంతో డేర్‌డెవిల్స్‌ రెండొందల స్కోరు చేసింది.

సొంతగడ్డపై సూపర్‌ జెయింట్‌కు ఘోర పరాభవం. పూణే జట్టు ఏకంగా 97 పరుగుల తేడాతో దిల్లీ డేర్‌డెవిల్స్‌ చేతిలో చిత్తు ఓడింది. బ్యాటింగ్‌లో సంజు శాంసన్‌ (102; 63 బంతుల్లో 8×4, 5×6), క్రిస్‌ మోరిస్‌ (38 నాటౌట్‌; 9 బంతుల్లో 4×4, 3×6) మెరుపులతో 20 ఓవర్లలో 4 వికెట్లకు 205 పరుగుల భారీ స్కోరు సాధించిన దిల్లీ, బౌలింగ్‌లోను జహీర్‌ ఖాన్‌ (3/20), మిశ్రా (3/11), కమిన్స్‌ (2/24) విజృంభణతో పుణె పై ఘన విజయం సాధించింది. 208 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన పూణే ఏ దశలోనూ గెలిచేలా కనిపించలేదు. మూడో ఓవర్లో తాత్కాలిక కెప్టెన్‌ రహానె (10)ను ఔట్‌ చేసి పుణె పతనానికి తెరతీశాడు జహీర్‌. 8 ఓవర్లు ముగిసేసరికి ఆ జట్టు స్కోరు 55/5. అప్పటికే డుప్లెసిస్‌ (8), స్టోక్స్‌ (2) కూడా పెవిలియన్‌ చేరిపోవడంతో పుణె ఓటమి ఖాయమైపోయింది. కానీ ధోని (11) క్రీజులో ఉండటంతో కాసిన్ని మెరుపులైనా ఆశించారు పుణె అభిమానులు. ఒక సిక్సర్‌ బాదిన ధోని కాసేపటికే మిశ్రా బౌలింగ్‌లో వెనుదిరగడంతో పుణెకు ఘోర పరాభవం తప్పదని తేలిపోయింది. సెంచరీ వీరుడు శాంసనే ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచాడు.

ఢిల్లీ ఇన్నింగ్స్‌ :

టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఢిల్లీకి ఆదిలోనే గట్టి ఎదురుదెబ్బ తగిలింది. రెండో ఓవర్‌ తొలి బంతికే ఓపెనర్‌ ఆదిత్య తారె (0)ను దీపక్‌ డకౌట్‌ చేశాడు. వన్‌డౌన్‌లో వచ్చిన సంజూ శాంసన్‌ నెమ్మదిగా ఆడుతూ ఈ ప్రభావం జట్టుపై పడకుండా చూసుకున్నాడు. ఆ ఓవర్లో రెండు బౌండ్రీలు కొట్టిన అతను.. దిండా బౌలింగ్‌లో వరుసగా రెండు ఫోర్లతో విజృంభించాడు. క్రీజులో కుదురుకున్నాక బిల్లింగ్స్‌ కూడా వేగం పెంచాడు. దాంతో రహానె రెండు ఎండ్‌ ల నుంచి స్పిన్నర్లను బరిలోకి దింపి ఢిల్లీని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. రహానే నమ్మకాన్ని నిజం చేస్తూ తన రెండో ఓవర్లో బిల్లింగ్స్‌ను క్లీన్‌బౌల్డ్‌ చేసిన తాహిర్‌ 69 పరుగుల రెండో వికెట్‌ భాగస్వామ్యానికి తెరదించాడు. తరువాత వచ్చిన రిషభ్‌ పంత నిలబడడంతో ఢిల్లీ 11 ఓవర్లకు 88/2తో నిలిచింది. రజత భాటియా వేసిన 12 ఓవర్లో రిషభ్‌ రెండు భారీ సిక్సర్లతో కొట్టాడు.

స్టోక్స్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో శాంసన్‌ 41 బంతుల్లో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్న శాంసన్‌ ఒక్కసారిగా గేరు మార్చాడు. జంపా బౌలింగ్‌లో లాంగా్‌ఫలో సిక్సర్‌ రాబట్టాడు. దిండా వేసిన 18వ ఓవర్లో రెండు సిక్సర్లు, బౌండ్రీతో చెలరేగి 19 పరుగులు రాబట్టిన సంజు, జంపా వేసిన తర్వాతి ఓవర్‌ తొలి బంతినే అద్భుత షాట్‌తో బౌలర్‌ తలమీదుగా స్టాండ్స్‌కు చేర్చిన శాంసన్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే మరుసటి బంతికి షాట్‌ ఆడే ప్రయత్నంలో శాంసన్‌ క్లీన్‌బౌల్డ్‌ అయ్యాడు. శాంసన్‌ ఔటయినా కూడా పూణే ఆటగాళ్లలో సంతోషం లేదు దానికి కారణం క్రిస్‌ మోరిస్‌. శాంసన్‌ స్థానంలో వచ్చిన క్రిస్‌ మోరిస్‌ ఆకాశమే హద్దుగా చెలరేగాడు. వచ్చిన బంతిని వచ్చినట్టు బాదేశాడు. కేవలం 9 బంతుల్లోనే 4 ఫోర్లు, 3 సిక్సర్లతో చెలరేగిన మోరిస్‌ 38 పరుగులు చేశాడు.

పుణె ఇన్నింగ్స్‌ :

ఈ మ్యాచ్‌కు పుణె కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత అనారోగ్యంతో దూరమవగా అజింక్యా రహానె సారథిగా వ్యవహరించాడు. ఢిల్లీ కెప్టెన్‌ జహీర్‌ ఖాన్‌ ఇన్నింగ్స్‌ మూడో ఓవర్లోనే ఓపెనర్‌ అజింక్యా రహానె (10)ను అవుట్‌ చేసి ప్రత్యర్థి పతనానికి నాంది పలికాడు. తన తర్వాతి ఓవర్లోనే మయాంక్‌ అగర్వాల్‌ (20)నూ పెవిలియన్‌ చేర్చాడు. ఆ వెంటనే మోరిస్‌ బౌలింగ్‌లో రాహుల్‌ త్రిపాఠి (10) వెనుదిరిగాడు.

స్మిత స్థానంలో జట్టులోకొచ్చిన డుప్లెసిస్‌ (8), ‘విలువైన’ ఆటగాడు బెన్‌స్టోక్స్‌ (2) ఏ మాత్రం ప్రభావం చూపలేకపోయారు. డుస్లెసిన్‌ను నదీమ్‌, స్టోక్స్‌ను కమిన్స్‌ అవుట్‌ చేయడంతో 54 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన పుణె డీలా పడింది. ఆదుకుంటాడనుకున్న ధోనీ (11) కూడా చేతులు ఎత్తేశాడు. రజత భాటియా (16), దీపక్‌ చాహర్‌ (14) కాసేపు పోరాడి జట్టు స్కోరు వంద దాటించారు.

సంజు ఒక్కడు 102 పరుగులు చేస్తే.. పుణె జట్టంతా కలిసి 108 పరుగులే చేసిందంటే ఆ జట్టు ఎంత చిత్తుగా ఓడిందో అర్థం చేసుకోవచ్చు.

                                                 దిల్లీ డేర్‌డెవిల్స్‌ ఇన్నింగ్స్‌:

తారె (సి) ధోని (బి) చాహర్‌ 0; బిల్లింగ్స్‌ (బి) తాహిర్‌ 24; శాంసన్‌ (బి) జంపా 102; పంత్‌ రనౌట్‌ 31; అండర్సన్‌ నాటౌట్‌ 2; మోరిస్‌ నాటౌట్‌ 38; ఎక్స్‌ట్రాలు 8 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 205

                                                      వికెట్ల పతనం:

                                           1-2, 2-71, 3-124, 4-166;

                                                          బౌలింగ్‌:

దిండా 3-0-36-0; చాహర్‌ 3-0-35-1; స్టోక్స్‌ 4-0-41-0; తాహిర్‌ 4-0-24-1; జంపా 4-0-45-1; భాటియా 2-0-21-0

                                                రైజింగ్‌ పుణె ఇన్నింగ్స్‌:

రహానె (సి) శాంసన్‌ (బి) జహీర్‌ 10; మయాంక్‌ అగర్వాల్‌ (సి) మోరిస్‌ (బి) జహీర్‌ 20; డుప్లెసిస్‌ (సి) పంత్‌ (బి) నదీమ్‌ 8; త్రిపాఠి (సి) నదీమ్‌ (బి) మోరిస్‌ 10; స్టోక్స్‌ (సి) పంత్‌ (బి) కమిన్స్‌ 2; ధోని (సి) నాయర్‌ (బి) మిశ్రా 11; భాటియా (సి) మోరిస్‌ (బి) మిశ్రా 16; చాహర్‌ (సి) పంత్‌ (బి) జహీర్‌ 14; జంపా (సి) శాంసన్‌ (బి) మిశ్రా 5; దిండా (సి) మిశ్రా (బి) కమిన్స్‌ 7; ఇమ్రాన్‌ తాహిర్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (16.1 ఓవర్లలో ఆలౌట్‌) 108;

                                                     వికెట్ల పతనం:

               1-24, 2-34, 3-49, 4-52, 5-54, 6-79, 7-94, 8-100, 9-107;

                                                        బౌలింగ్‌:

నదీమ్‌ 4-0-23-1; కమిన్స్‌ 3.1-0-24-2; జహీర్‌ 3-0-20-3; మోరిస్‌ 2-0-19-1; అండర్సన్‌ 1-0-10-0; మిశ్రా 3-0-11-3