//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బార్‌ లో భారీ అగ్ని ప్రమాదం... వ్యక్తులు సజీవదహనం !

Category : national

ఇటీవలి కాలంలో బార్ - పబ్ కల్చర్ బాగా పెరిగిపోయింది.

నిబంధనలకి తిలోదకాలు ఇచ్చి బార్లకి వచ్చిన వారికి ఫూటుగా మద్యం తాగిస్తున్నారు. మద్యం తాగిన వారు ఏమీ చేయలేని స్థితిలో ఏమైనా ప్రమాదాలు సంభవిస్తే ఆ ప్రమాదాలకి బలి అవుతున్నారు. తాజాగా ఓ బార్‌లో సంభవించిన ఘోర అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవదహనం అయ్యారు. ఈ ఘటన బెంగళూరులోని కైలాశ్‌పాల్య మార్కెట్‌లో చోటుచేసుకుంది. కుంబార సంఘ భవనం కింది అంతస్తులోని కైలాశ్ బార్‌లో సోమవారం తెల్లవారుజామున 2:30 గంటల సమయంలో ఈ అగ్నిప్రమాదం సంభవించింది.

దట్టమైన పొగను గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొన్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు. అగ్ని ప్రమాదంలో సజీవదహనమైన ఐదుగురు వ్యక్తులు బార్‌లో పనిచేసే వారిగా గుర్తించారు. తమ విధులు ముగిసిన తర్వాత బార్‌లో నిద్రపోతున్న వీళ్లంతా సజీవదహనమయ్యారు.

ప్రమాదం జరిగిన ప్రాంతం బెంగళూరు నగరానికి గుండె లాంటిది. నిరంతరం ఈ ప్రాంతం రద్దీగా ఉంటుంది. మృతుల్లో ముగ్గురు తుముకూరుకు చెందిన స్వామి (23), ప్రసాద్ (20), మహేశ్ (35)లుగానూ, హసన్‌కు చెందిన మంజునాథ్ (45), మండ్యాకు చెందిన కీర్తి (24)గా గుర్తించారు.

ప్రమాదానికి గల కారణాలు ఏంటో తెలియరాలేదని, దీనిపై విచారణ చేపట్టినట్లు అధికారులు తెలిపారు. వారం రోజుల కిందట ముంబయిలోని కమలమిల్స్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో 14 మంది సజీవదహనమైన విషయం తెలిసిందే. ఇది జరిగిన రెండు రోజుల్లోనే ముంబై మరోల్ ఏరియాలో మరో అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో నలుగురు ప్రాణాలు కోల్పోగా, ఏడుగురు గాయపడ్డారు.