విద్వేష ప్రసంగాలకు, నకిలీ వార్తలకు సంబంధించిన పోస్టింగ్ లను తొలగించని పక్షంలో సోషల్ మీడియా సంస్థలపై రూ 350 కోట్ల మేరకు జరిమానా విధించే విధంగా జర్మన్ పార్లమెంట్ అసాధారణమైన బిల్ ను ఆమోదించింది. బాలల లైంగిక వేధింపులు, ఉగ్రవాద బెదిరింపులకు సంబంధించిన పోస్టింగ్ లకు కూడా ఈ చట్టం వర్తిస్తుంది. ఈ చట్టం అమలు చేయడం భారత ప్రభుత్వానికి సహితం ఒక మార్గం చూపినట్లు అయింది.
జస్టిస్ మంత్రి యికో మాస్ ఒక ప్రకటనలో చంపుతామని బెదిరింపులు, అవమాన పరచడం, విద్వేషానికి ప్రోత్సహించడం వంటివి భావప్రకటన స్వేచ్ఛ క్రిందకు రాబోవని స్పష్టం చేశారు. పైగా అవి ఇతరుల భావ ప్రకటన స్వాతంత్ర్యాన్ని హరించినట్లు కాగలదని అన్నారు.
ఈ చట్టం ప్రకారం తమ సైట్ లలో ఎవ్వరైనా ఇటువంటి పోస్టింగ్స్ చేస్తే ఫేస్ బుక్ గాని, ట్విట్టర్ గాని 24 గంటల లోగా తొలగించవలసిందే. అంతగా తీవ్రమైన నేరాలు కానీ పక్షంలో అటువంటి పోస్టింగ్ లను తొలగించడానికి గడువు వారం రోజుల వరకు ఉంటుంది. పోస్టింగ్ లను తొలగించడంలో నిర్లక్ష్యం ప్రదర్శిస్తే కంపెనీలకే కాకూండా పర్యవేక్షించే వ్యక్తులకు కూడా రూ 35 కోట్ల వరకు జరిమానా విధించే అవకాశం ఈ చట్టం సమకూర్చుతుంది.
పైగా సర్వీస్ ప్రొవైడర్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి తమకు ఎన్ని ఫిర్యాదులు వచ్చాయో, తాము ఏమి చర్య తీసుకున్నామో తెలుపుతూ ఒక ప్రకటన చేయవలసి ఉంది.