మన రోజూ వారి ప్రయాణాల్లో క్యాబ్ సర్వీసులు భాగమయ్యాయి. ఎక్కడికి వెళ్లాలన్నా చిటికెలో క్యాబ్ బుక్ చేసుకొని ప్రయాణాలు సాగిస్తున్నారు నగరవాసులు. ఇక ఢిల్లీ, ముంబై, బెంగుళూరు వంటి నగరాల్లోనైతే వీటి వాడకం చాలా ఎక్కువగా ఉంది.
అయితే మనం క్యాబ్ బుక్ చేసుకున్న తర్వాత కొంతమంది డ్రైవర్లు ఆ ప్రదేశానికి రాలేమంటూ రైడ్‌ను రద్దు చేసుకుంటారు. ఇక చేసేదేమి లేక ప్రయాణికులు వేరే క్యాబ్‌ను బుక్ చేసుకుంటుంటారు. ఇక మీదట అలా ఎవరైన డ్రైవర్ రైడ్‌ను రద్దు చేస్తే రూ.25 వేల వరకు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. దీనికి సంబంధించిన ఓ ప్రతిపాదనను దిల్లీ ప్రభుత్వం త్వరలోనే తీసుకురానుంది.
ఢిల్లీ రోడ్డు రవాణా శాఖ సరికొత్త డ్రాఫ్ట్‌ను రూపొందించింది. క్యాబ్ సేవల ధరలు పెరుగుదలను నియంత్రించడంతో పాటు, వాటిల్లో ప్రయాణించే ప్రయాణికుల భద్రతకు సంబంధించిన నిబంధనలను మరింత కఠినతరం చేయాల్సిందిగా కోరుతూ ఆ డ్రాఫ్ట్‌లో పేర్కొంది. అంతే కాకుండా క్యాబ్ డ్రైవర్లు ప్రయాణికుల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే వారిపై పోలీస్ కేసు పెట్టాలని అందులో పేర్కొన్నారు.
ఒకవేళ కేసు పెట్టకుండా ఉన్నట్లయితే సదరు డ్రైవర్ లక్ష రూపాయలు జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఈ ముసాయిదాను త్వరలోనే కేబినేట్ ముందుంచనున్నారు. ఇది కాస్త ఆమోదం పొందితే, కొత్త నిబంధనలు అమల్లోకి వస్తాయి.