జెట్ ఎయిర్వేస్ విమానానికి పెను ప్రమాదం తప్పింది.
విమానం నడుపుతున్న ఇద్దరు సీనియర్ పైలట్లు కాక్ పిట్ లోనే కొట్టుకున్నారు. సిబ్బంది జోక్యం చేసుకున్నా వినలేదు. దీంతో విమానాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. జనవరి ఒకటో తేదీ లండన్ నుంచి ముంబై వస్తున్న జెట్ ఎయిర్ వేస్ విమానంలో ఈ ఘటన జరిగింది. 324 మంది ప్రయాణికులతో విమానం లండన్ నుంచి ముంబై కి బయల్దేరింది. జనవరి 1న ఉదయం 10 గంటలకు బయలుదేరిన విమానంలో 14 మంది సిబ్బంది కూడా ఉన్నారు.
విమానం గాల్లో ఉండగా కాక్‌పిట్ లోని ఇద్దరు పైలట్ల మధ్య సమాచార మార్పిడిలో లోపం కారణంగా వివాదం నెలకొంది. ఇద్దరూ గొడవకు దిగారు. కాక్‌పీట్ కెప్టెన్.. కో-పైలట్ చెంప చెల్లుమనిపించాడు. ఆమె ఏడుస్తూ కాక్‌పిట్ నుంచి బయటకొచ్చింది. ఇతర సిబ్బంది ఆమెను ఓదార్చి కాక్‌పిట్‌లోకి పంపించారు. అప్పటికే కెప్టెన్ కూడా ఆమెను కాక్‌పిట్‌లోకి పంపించాలని సిబ్బందిని కోరారు. తర్వాత కూడా వారిద్దరు తీవ్రంగా మరోసారి గొడవపడి.. కాక్‌పిట్‌ను ఇద్దరూ వదిలేశారు.
కో-పైలెట్ మరోసారి అందులోకి వెళ్లేందుకు నిరాకరించగా.. ప్రయాణీకులను సురక్షితంగా చేర్చాలన్న సిబ్బంది కోరడంతో ఆమె అంగీకరించింది. ఎట్టకేలకు విమానాన్ని సురక్షితంగా ముంబైలో ల్యాండ్ చేశారు. పైలెట్ల మధ్య గొడవను జెట్ ఎయిర్ వేస్ అధికారులు అంగీకరించారు. ఇద్దరి మధ్య సమాచార బదిలీ లోపం కారణంగా గొడవ జరిగినట్లు ప్రకటించింది యజమాన్యం.
ఈ వవ్యహారంపై DGCA (డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్) తీవ్రంగా స్పందించింది. విచారణకు ఆదేశించింది. ప్రయాణికులను ప్రమాదంలో పెట్టడం సరైంది కాదని వార్నింగ్ ఇచ్చింది. బాధ్యులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది. ఇద్దరు పైలెట్లను తాత్కాలికంగా విధుల నుంచి తొలగించింది. ఘటనపై పూర్తి విచారణ చేపట్టింది.