//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

శ్రీకాకుళ పోరాటానికి యాభై ఏళ్లు

Category : editorial

నక్సల్బరీ పంథా తూర్పు తీరాన తెరిచిన మరొక పోరాట ఫ్రంట్‌ శ్రీకాకుళం. భూస్వాముల, వడ్డీ వ్యాపారుల ఇళ్లపై వందల వేల సంఖ్యలో ప్రజలు దాడి చేయడం; అప్పు పత్రాలు తగులబెట్టడం; రుణ విముక్తి ప్రకటించి, తాకట్టుపడిన పోడు భూములను స్వాధీనం చేసుకోవడం... ఇలా గరుడభద్రపురం, రామభద్రపురం మొదలుకొని శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ తాలూకా లయిన పార్వతీపురం, ఉద్దానం, పాతపట్నం, పాలకొండలలో కెరటాలు కెరటాలుగా విస్తరించింది. శ్రీకాకుళంలోన చిందింది రక్తము కొండలెరుపెక్కినాయి పోరాడ బండలే కదిలినాయిమన దేశంలో సాయుధ రైతాంగ వర్గపోరాటాలకు చరిత్రలో మలుపు అనదగిన తేదీలు చిరస్థాయిగా గుర్తుండిపోతాయి. తెలంగాణ రైతాంగ పోరాటానికి జూలై 4, 1946 వలె; నక్సల్బరీ మే 23–25, 1967 వలె; శ్రీకాకుళ పోరాటానికి 31 అక్టోబర్‌, 1967.ఈ మూడు సందర్భాల్లోనూ– మైదాన ప్రాంతమైన కడివెండిలో భూస్వామి ఏజెంటు తుపాకి గుండుకు గురయి వ్యవసాయ కూలీ దొడ్డి కొమురయ్య; నక్సల్బరీలో సీఆర్‌పీఎఫ్‌ కాల్పుల్లో సంతాల్‌ ఆదివాసీ మహిళలు, పిల్లలు; శ్రీకాకుళంలో ఒక భూస్వామి తుపాకి గుండ్లకు గిరిజనులు కోరన్న, మంగన్నలు అమరులైనారు.

1964 కమ్యూనిస్టు పార్టీలో మొదటి చీలిక నాటికే వెంపటాపు సత్యనారాయణ (సత్యం, కొండబారిడి మాస్టారుగా చరిత్రలో నిలిచిపోయిన శ్రీకాకుళ పోరాట నిర్మాత), ఆదిభట్ల కైలాసం శ్రీకాకుళం ఏజెన్సీలో ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఈ ఇద్దరినీ విప్లవ రాజకీయాల వైపు పురికొల్పిన రాములు ఎక్కువకాలం కొనసాగలేదు. వసంతాడ రామలింగాచారి కమ్యూనిస్టు కార్యకర్తగా పనిచేస్తున్నాడు. 1964 నుంచీ గిరిజనుల మధ్య పనిచేస్తూ, మైదాన ప్రాంతాల నుంచి వచ్చిన భూస్వాముల, వడ్డీ వ్యాపారుల దోపిడీకి వ్యతిరేకంగా వారిని సంఘటితపరుస్తూ సత్యం, కైలాసాలు గిరిజనుల చైతన్య స్థాయి పెరిగే క్రమంలో పోరాట స్థాయిని పెంచుతూ పోయారు. గిరిజన సహకార సంఘాలు, గిరిజన సంఘర్షణ సమితులు నెలకొల్పుతూ; సేకరించిన అటవీ వస్తువుల విక్రయాల్లో న్యాయమైన రేట్లు, న్యాయమైన తూనికలు మొదలైన ఆర్థిక పోరాటాలు నిర్వహిస్తూ పోడు భూముల్ని తాట్టు పెట్టుకున్న భూముల విముక్తి కోసం, పోడు భూములపై హక్కు కోసం పోరాటాలు నిర్మిస్తూ పోయారు. ముఖ్యంగా గిరిజనుల మౌలిక అవసరాలైన బియ్యం, ఉప్పు, పప్పుల కోసం విలువయిన అటవీ సంపద మాత్రమే కాకుండా తమ నెత్తురు చెమటయిన పోడు వ్యవసాయంలో తమ భూముల్లో తామే కంబారీ (కూలీ)లయిన బానిసత్వానికి వ్యతిరేకంగా పోరాటాలకు ఆయత్తం చేసారు.

అట్లా నిర్మాణం చేస్తూ వచ్చిన గిరిజనుల సంఘటిత శక్తిని ప్రకటించడానికి శ్రీకాకుళం జిల్లా గిరిజన మహాసభను అక్టోబర్‌ 31న మొండెంఖల్లు అనే గ్రామంలో తలపెట్టారు. విస్తృతప్రచారంతో జరిగిన ఆ సభకు జిల్లా నలుమూలల పోరాటప్రాంతాల నుంచీ చీమల పుట్ట నుంచి కదలి వచ్చినట్లుగా గిరిజనులు తరలివస్తూ ఉంటే లేవిడి అనే గ్రామం దగ్గర ఒక చెట్టు చాటుకు కాపుగాచిన రాజమండ్రి నుంచి వచ్చిన భూస్వామి సత్యనారాయణ గుంపుపై కాల్పులు జరిపాడు. ఆ కాల్పుల్లో అక్కడికక్కడే కోరన్న మంగన్న అనే ఇద్దరు గిరిజనులు నేలకొరిగారు. ఈ వార్త జిల్లాఅంతటా దావానలం వలె వ్యాపించి సభా నిర్వహణ సన్నాహాల్లో ఉన్న సత్యం కైలాసాలకు తెలిసింది. ఆ సభావేదిక మీంచే ఆత్మరక్షణకోసమైనా సరే గిరిజనులు ఆయుధంపట్టక తప్పదని ప్రకటించారు.కోరన్న, మంగన్నల అమరత్వాన్ని, సాయుధ పోరాట ప్రకటనను – అప్పటి వరకు జరిగిన వర్గపోరాట సన్నాహాలను, కృషిని, అప్పటికే 1967 మే 25 నుంచే నక్సల్బరీ పంథా వైపు నీటికి చేపల వలె ఎక్కుతున్న ప్రజల చైతన్యాన్ని కళ్లకు కట్టినట్లుగా చిత్రిస్తూ ప్రజా వాగ్గేయకారుడు సుబ్బారావు పాణిగ్రాహి అక్టోబర్‌ 31 జముకు కథ రాసాడు. ఏలూరు, ఖమ్మంల దాకా శ్రీకాకుళ గిరిజన రైతాంగ సాయుధ పోరాటానికి అశేష పీడిత ప్రజల మద్దతునే కాదు ఎందరో బుద్ధిజీవుల, కవుల, కళాకారుల, ప్రజాస్వామ్యవాదుల మద్దతును కూడగట్టాడు.నక్సల్బరీ పంథా తూర్పు తీరాన తెరిచిన మరొక పోరాట ఫ్రంట్‌ అయింది శ్రీకాకుళం. భూస్వాముల, వడ్డీవ్యాపారుల ఇళ్లపై వందల వేల సంఖ్యలో ప్రజలు దాడి చేయడం, అప్పు పత్రాలు తగులబెట్టడం, రుణవిముక్తి ప్రకటించి, తాకట్టుపడిన పోడు భూములను స్వాధీనం చేసుకోవడం... ఇలా గరుడభద్రపురం, రామభద్రపురం మొదలుకొని శ్రీకాకుళం జిల్లా ఏజెన్సీ తాలూకాలయిన పార్వతీపురం, పాలకొండ, పాతపట్నం, ఉద్దానంలలో కెరటాలుగా కెరటాలుగా విస్తరించింది.

శ్రీకాకుళ పోరాట నాయకత్వం నక్సల్బరీ పంథా వైపే కాకుండా చారుమజుందార్‌ నాయకత్వం పట్ల కూడా విశ్వాసం ప్రకటించి 1969 ఏప్రిల్‌ 22న సీపీఐ (ఎంఎల్‌) ఏర్పాటులోనూ, మేడే రోజు షహీద్‌ మినార్‌, కలకత్తాలో పార్టీ ఆవిర్భావ ప్రకటనలోనూ పాల్గొన్నారు. ఆవిర్భావంలో పాల్గొన్న కొన్ని రోజులు కలకత్తా, ఒరిస్సాలలో పార్టీ నిర్మాణ కార్యక్రమాల్లో పాల్గొని వస్తున్న క్రమంలోనే 27 మే 1969న పంచాది కృష్ణమూర్తి, రమేశ్‌చంద్ర సాహు, తామాడ చినబాడు (14 సంవత్సరాల బంగారుబాబు, సుబ్బారావు పాణిగ్రాహి జముకు కథల దళంలో స్త్రీ పాత్ర వేసిన బాలుడు) మొదలైన ఆరుగురు సోంపేట రైల్వేస్టేషన్‌లో అరెస్టయ్యారు. పార్వతీపురం కుట్రకేసు చార్జిషీటులో నమోదయిన ఆధారాల ప్రకారం ‘బంప్‌ దెమ్‌ ఆఫ్‌’ అనే హోంమంత్రి వైర్‌లెస్‌ ఆదేశాలతో జరిగిన మొదటి ‘ఎన్‌కౌంటర్‌’ హత్య అది.ఇంక అక్కడి నుంచి 1972 దాకా శ్రీకాకుళ చరిత్ర అంతా రక్తసిక్తమైన చరిత్ర. రెంజిమ్‌, తాబేలు నాయుడు కుటుంబంలోపన్నెండు మంది సభ్యులు, అంకమ్మ, సరస్వతి మొదలు అరికె సోములు దాకా ఎందరో ఆదివాసీ యోధులు, సానుభూతిపరులు ఎన్‌కౌంటర్‌లలో అమరులయ్యారు. బొడ్డపాడు వంటి ఉద్దానప్రాంతం, ఏజెన్సీఏరియా నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు తామాడ గణపతి, పంచాది నిర్మల, సుబ్బారావు పాణిగ్రాహి, రమణమూర్తి– మైదాన ప్రాంతం నుంచి వచ్చిన డాక్టర్‌ చాగంటి భాస్కరరావు, మల్లికార్జునుడు మొదలు అనంతపురం రీజినల్‌ ఇంజినీరింగ్‌ కాలేజీ నుంచి వచ్చిన రాజారాంరెడ్డి దాకా 370మంది విప్లవకారులు, సానుభూతిపరులు బూటకపుఎన్‌కౌంటర్లలో అమరులయ్యారు.వెంపటాపు సత్యం, ఆదిభట్ల కైలాసం – 1970 ఫిబ్రవరిలో శ్రీశ్రీ అరవై ఏళ్ల సభలో సాహిత్యంలో పోలరైజేషన్‌ మొదలుకొని జూలై 4న ‘విరసం’ ఆవిర్భావం వరకు చూసిన శ్రీకాకుళ విప్లవ నాయకత్వం – ఒక వారం రోజులు కూడా గడవక ముందే జూలై 10న శత్రువు చేతజిక్కి బూటకపు ఎన్‌కౌంటర్‌లో అమరులయ్యారు. మంచాలకు కట్టవేసి ఆ మృతదేహాలను పార్వతీపురం ఆసుపత్రికి పోస్ట్‌మార్టమ్‌ కొరకు తీసుకవచ్చినప్పుడు వేలాదిమంది ప్రజలు తమ కొండబారిడి మాస్టారి కడసారి చూపు కోసం వచ్చారు .1972లో అరికెసొములు, రాజారాంరెడ్డి దళం ఎన్‌కౌంటర్‌తో శ్రీకాకుళం తుడిచిపెట్టుకపోయింది. ఈ మధ్య కాలమంతా కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వుల ‘కల్లోలిత ప్రాంతాల ప్రకటన’, ఎనభై గ్రామాల్లో సీఆర్‌పీఎఫ్‌ క్యాంపులు, ఎన్‌కౌంటర్లు – శ్రీకాకుళంలో నెత్తుర్లు పారాయి.అయినా బూడిద నుంచి ఫీనిక్స్‌ పక్షి లేచినట్లుగా ‘తిరిగి తిరిగొచ్చింది నక్సల్బరీ, తనకు మరణమే లేదంది నక్సల్బరీ’ అని ఒక కవి రాసినట్లుగా 1980 సీపీఐ (ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ ఏర్పడిన తర్వాత శ్రీకాకుళంలో మళ్లీ పోరాటం మొదలైంది