సంచలనాలకు మారు పేరైన ఫిఫా లో గత రాత్రి అద్భుతం జరిగింది. అసమాన ప్రదర్శనను కొనసాగిస్తూ క్రొయేషియా ఫిఫా-2018 పుట్‌బాల్‌లో మరోసారి సత్తా చాటింది. లుజ్నికీ స్టేడియంలో జరిగిన రసవత్తర పోరులో ఇంగ్లాండ్‌పై 2-1 తేడాతో గెలిచి తొలిసారిగా ఫిఫా లో ఫైనల్‌కు చేరింది.
దీనితో క్రొయేషియా తమ ఫుట్‌బాల్ చరిత్రను మరింత గా మెరుగు పరుచుకుంది. ఇక ఆదివారం జరిగే టైటిల్ పోరులో ఫ్రాన్స్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. 1966 తర్వాత రెండో సారి ఫైనల్ చేరాలన్న ఇంగ్లాండ్ కలలను క్రొయేషియా భగ్నం చేసింది. రెండు జట్లు అంచనాలు లేకుండానే బరిలోకి దిగినప్పటికీ విజయం క్రొయేషియానే వరించింది.
మొదట మ్యాచ్ ప్రారంభమైన 5 నిమిషాలకే ఇంగ్లాండ్ ఆటగాడు కీరన్ ట్రిప్పర్ గోల్‌కొట్టి తమ జట్టును ఆధిక్యంలో నిలిపాడు. ప్రథమార్థంలో ఒక్కగోలే నమోదైనప్పటికీ ద్వితీయార్థంలో క్రొయేషియా ఆటగాడు ఇవాన్ పెరిసిక్ 68వ నిమిషంలో గోల్ కొట్టి జట్టు స్కొరును సమం చేశాడు. ఇక అదనపు సమయంలో మారియో మండ్జుకిక్ 109 నిమిషంలో గోల్ చేసి క్రొయేషియాను విజయ తీరాలకు చేర్చాడు.