అధ్యక్ష ఎన్నికల సందర్బంగా తన ప్రత్యర్థి అయిన హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ ఈమెయిల్ సర్వర్ వాడకంపై జరుగుతున్న విచారణను సరిగా హ్యాండిల్ చేయలేదన్న కారణంతో ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా ఉన్న జేమ్స్ కామీని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పదవి నుంచి తప్పించిన విషయం తెలిసిందే. అయితే ఎఫ్‌బీఐ డైరెక్టర్‌గా తనను తొలగించడంపై జేమ్స్ కామీ చాలా రిలాక్స్ గా స్పందించారు. తన సహోద్యుగులకు కృతజ్ఞతలు చెబుతూ ఓ లేఖ రాశారు. దానిని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్ట్ చేశారు.
తన భావాలను పంచుకున్న సందర్భంగా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫై పరోక్షంగా కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఏదో ఒక కారణం చెప్పి లేదంటే అసలు ఎలాంటి కారణం లేకుండా కూడా ఎఫ్‌బీఐ డైరెక్టర్‌ను అధ్యక్షుడు తొలగిస్తారని నాకు తెలుసు. నన్ను తొలగించాలన్న నిర్ణయంపై నేను ఎక్కువగా స్పందించను. మీరు కూడా ఈ విషయాన్ని ఇంతటితో వదిలేయండి. మిమ్మల్ని సంస్థను చాలా మిస్ అవుతున్నా అని జేమ్స్ కామీ ఆ లేఖలో రాశారు. అమెరికా ప్రజలు ఎఫ్‌బీఐని పోటీతత్వానికి నిజాయతీకి స్వేచ్ఛకు గుర్తుగా భావిస్తారు. దానిని కాపాడాల్సిన బాధ్యత మీపై ఉంది. మన విలువలు రాజ్యాంగ ధర్మాన్ని ఇలాగే కాపాడుతూ అమెరికా ప్రజల భద్రత విషయంలో రాజీ పడరని భావిస్తున్నా. మీతో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది అని జేమ్స్ కామీ వెల్లడించారు.