భారతీయులు పవిత్రంగా భావించే ఓంకారం.. ఓ అద్భుత మంత్రం. ఆ మంత్రాన్ని మనసులో జపించినంత మాత్రానే.. మనసుకి ఎంతో శాంతి కలుగుతుంది. ఏదో అద్భుత శక్తి మనల్ని అవహిస్తుంది. ఓంకార నాదం ఎంత శక్తిమంతమైనదో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తాజాగా ఓంకార నామజపం గొప్పతనం మరోసారి వెలుగుచూసింది. ఏడుస్తున్న తన చిన్నారిని నిద్ర పుచ్చేందుకు ఓ తండ్రి ఆశ్చర్యంగా ఈ ఓంకారాన్నే మంత్రంలా ఉపయోగించాడు. అప్పటివరకు తండ్రి చేతిలో గుక్క పట్టి ఏడుస్తున్న ఆ చిన్ని పాప అది వింటూ నిద్రలోకి జారుకుంది. ఫేస్ బుక్ లో ప్రస్తుతం ఈ వీడియో వైరల్ గా మారింది.
ఓంకారంలో ఉన్న వైబ్రేషన్ల శక్తి వల్లే పాప అంత చక్కగా నిద్రపోయిందని చాలామంది కామెంట్ చేశారు. ఇది చూసిన తర్వాత తాము కూడా అలాగే తమ పిల్లలను పడుకోబెడుతున్నామని మరికొందరు అన్నారు. తన మనవడు నిద్రమధ్యలో లేచి ఏడుస్తుంటాడని, వాడిని వెంటనే నిద్రపుచ్చడానికి తాను ఇదే మంత్రం వాడుతున్నానని ఓ యూజర్ కామెంట్ చేశారు. మొత్తంగా చాలా మంది తమ చిన్నారులను నిద్ర పుచ్చడానికి ఇదే చిట్కా ఉపయోగిస్తామని ట్వీట్ చేశారు.