//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మద్దతు ధరకై ఢిల్లీకి రైతుల పాదయాత్ర

Category : national

తాము పండించిన పంటకు గరిష్ట ధరను, వ్యవసాయాన్ని మరింత లాభదాయకంగా చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్‌ చేస్తూ రైతులు ప్రస్తుతం పాదయాత్ర నిర్వహిస్తున్నారు. ఎం.ఎస్‌. స్వామినాథన్‌ కమిటీ సిఫార్సు చేసిన విధంగా, ఉత్పత్తి ధర కన్నా కనీస మద్దతు ధర 1.5 రెట్లు అధికంగా అమలు చేయాలని కోరుతున్నారు. అత్యధిక రైతులు అప్పుల్లో మునిగిపోయినందున వారి రుణాలు మాఫీ చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. 

పలు రైతు సంఘాల భాగస్వామ్యంలో మధ్యప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌ రాష్ట్రాల మీదగా ఈ నెల 18 వరకు కిసాన్‌ ముక్తియాత్ర జరుగుతోంది. ప్రభుత్వం ఇప్పటికే పెంచిన ఉత్పత్తి వ్యయం, కనీస మద్దతు ధరలు తగిన విధంగా లేవని వారు పేర్కొన్నారు. 

స్వరాజ్‌ అభియాన్‌ నాయకుడు, విద్యావేత్త యోగేంద్ర యాదవ్‌, నర్మదా బచావో ఆందోళన్‌ నాయకురాలు మేథా పాట్కర్‌, మహారాష్ట్ర రైతు నేత రాజు శెట్టి, ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ, కిసాన్‌ సంఘర్ష్‌ మోర్చా, భారతీయ కిసాన్ యూనియన్‌ ఆఫ్‌ పంజాబ్‌తో పాటు ఇతర సంఘాలు ఈ యాత్రలో పాల్గొంటున్నాయి. ఈ పాదయాత్రలన్నీ కలిసి మంగళవారం ఢిల్లీలోని జంతర్‌మంతర్‌ వద్దకు చేరుకుంటాయి. 

ఈ పాదయాత్ర ఉద్యమం మధ్య ప్రదేశ్‌లో ప్రారంభమైంది. రైతు నాయకులు కొందరిని పోలీసులు నిర్బంధించినప్పటికీ యాత్ర ప్రారంభమై ఇండోర్‌, బర్వాని, బర్డా, నాసిక్‌, గుజరాత్‌లోని వ్యారా, సూరత్‌, రాజస్థాన్‌లోని భిల్వారా, జైపూర్‌ తదితర ప్రాంతాల నుండి ప్రయాణించి ఢిల్లీ చేరుకుంటుంది. 

ఇలా ఉండగా, డిమాండ్లు నెరవేరుస్తామని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హామీనిచ్చి తమను మోసం చేశాయని విమర్శిస్తూ తమిళనాడు రైతులు మరోసారి దేశ రాజధానిలో అడుగుపెట్టారు. దక్షిణ భారత నదీ జలాల అనుసంధాన సంఘం అధ్యక్షుడు అయ్యకన్ను నేతృత్వంలో సుమారు 102 మంది రైతులు ప్లకార్డులు చేతబూని ప్రధాని కార్యాలయం వైపుగా కదిలి నినాదాలతో ఢిల్లీ వీధులను హోరెత్తించారు. అయితే వారిని పోలీసులు అడ్డుకున్నారు.