సినిమా హీరోలపై అభిమానులకు ఎంత అభిమానం ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. తమ అభిమాన హీరో సినిమా విడుదలైతే కధానాయకుడి చిత్ర పటానికి పాలాభిషేకాలు, భారీ ఫ్లెక్సీలతో స్వాగతిస్తున్నారు. ఇక వారు పాల్గొనే ఫంక్షన్ లను చూడటానికి తరలివెళ్లి ప్రాణాలు కోల్పోయిన అభిమానులు కూడా ఉన్నారు. కానీ ఈ అభిమాని వీటన్నిటికీ బిన్నంగా తన అభిమాన హీరో పోషించిన పాత్రను స్ఫూర్తిగా తీసుకోని ఏకంగా 11 స్వర్ణ పతకాలు సాధించాడు. బెంగళూరు వ్యవసాయ విజ్ఞాన విశ్వవిద్యాలయంలో BSC (అగ్రికల్చర్) విభాగంలో ఈ ఘనత సాధించాడు.
ఈ అభిమాని పేరు రఘువీర్. ఇతను కన్నడ యువ కధానాయకుడు యశ్ ను అమితంగా ఆరాధిస్తాడు. యశ్ నటించిన గూగ్లి చిత్రంలోని పాత్ర బాగా ఇష్టపడేవాడట. అందులో విద్యార్థిపాత్ర పోషించిన హీరో తోటి విద్యార్థితో సవాలు చేస్తాడు. కేవలం రెండేళ్లలో ప్రపంచ స్థాయి వ్యాపారవేత్తగా ఎదిగి తనను కాదని వెళ్లిన యువతిని ప్రేమించేలా చేస్తానంటాడు. ఆ పాత్రలోని సవాలును తన నిజ జీవితానికి అన్వయించుకొని కష్టపడి చదివాను అని ఈ విజేత అభిమాని రఘువీర్ అన్నాడు. అభిమానులు అంటే ఇలా కూడా ఉండొచ్చు అని నిరూపిస్తూ అభిమానానికి మరో నిర్వచనం ఇస్తున్నాడు.