భారత్-న్యూజిలాండ్ మధ్య వన్డే సిరీస్ అభిమానుల ను విశేషంగా ఆకట్టుకున్నది. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చిన కివీస్ బలమైన కోహ్లీసేనకు గట్టి పోటీ ఇచ్చింది. ఇప్పుడు మరో రసవత్తర సమరానికి సమయం ఆసన్నమైంది. టీ-20ల్లో తిరుగులేని శక్తిగా ఉన్న న్యూజిలాండ్‌తో మూడు టీ-20ల సిరీస్‌లో భాగంగా బుధవారం ఇక్కడ తొలి మ్యాచ్ జరగనుంది. ఇది వెటరన్ పేసర్ ఆశీష్ నెహ్రాకు వీడ్కోలు మ్యాచ్. గాయాలు.. పునరాగమనాలతో కెరీర్‌ను కొనసాగించిన నెహ్రా తన కెరీర్‌ను ఆరంభించిన మైదానం లోనే విజయంతో అల్విదా చెబితే నెహ్రాకు అంతకుమించిన సంతృప్తి మరొకటి ఉండదు. అందువల్ల ఈ మ్యాచ్‌లో ఎలాగైనా నెగ్గి నెహ్రాను ఘనంగా సాగనంపాలని భారత జట్టు దృఢ సంకల్పంతో ఉన్నది. కెరీర్ చరమాంకంలో రీ ఎంట్రీ ఇచ్చిన నెహ్రాకు ఈ ఫార్మాట్లో మంచి రికార్డు ఉండడం మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది. కానీ, టీ-20ల్లో కివీస్‌ను భారత్ ఓడించలేకపోతోంది. చివరగా.. స్వదేశంలో టీ-20 వరల్డ్‌కప్‌లో ఆడిన మ్యాచ్‌లో చిత్తుగా ఓడిపోయింది. అయితే, ఇప్పుడు టీమిండియా అత్యంత పటిష్టంగా ఉన్నది. పరిమిత ఓవర్లలో పెద్ద జట్లపై వరుస పెట్టి సిరీస్‌లు నెగ్గింది. మొన్ననే అత్యంత హోరాహోరీగా సాగిన వన్డే సిరీస్‌లో 2-1తో కివీస్‌ను ఓడించిన కోహ్లీసేన.. అదే ఫలితాన్ని పొ ట్టి ఫార్మాట్లోనూ పునరావృతం చేయాల ని కోరుకుంటోంది.
సూపర్ ఫామ్‌లో టీమిండియా.......చివరి వన్డేలో శతకబాది అత్యంత వేగంగా 9000 పరుగులు చేసిన ఆటగా డిగా రికార్డు సృష్టించిన కెప్టెన్ విరాట్ కోహ్లీ తన ఖాతాలో మరో సిరీస్‌ను చేర్చు కోవాలని చూస్తున్నాడు. కాన్పూర్‌లో భారీ సెంచరీతో పాటు రెండొందలు జోడించిన రోహిత్, కోహ్లీ ఇద్దరూ భీకర ఫామ్‌లో ఉన్నారు. అలవోకగా శతకాలు బా దేస్తున్న ఈ ఇద్దరూ అదే ఊపు ను కొనసాగించాలని చూస్తున్నారు. కెప్టెన్, వైస్ కెప్టెన్‌తో పాటు శిఖర్ ధవన్, ధోనీకి బ్లాక్‌క్యాప్స్ జట్టు పై మంచి రికార్డు ఉన్నది. టాపార్డర్‌లో ధవన్, మిడిలార్డర్లో ధోనీ బాధ్యతలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నారు. అలాగే, హార్దిక్ పాండ్యా ఆల్‌రౌండ్ సామర్థ్యం భారత్‌కు మరింత బలం చేకూరుస్తోంది. ఇక, బౌలర్లు భువనేశ్వర్, జస్ప్రీత్ బుమ్రా కొత్త బంతితో శుభారంభాలు ఇవ్వడంతో పాటు డెత్ ఓవర్లలో హడలెత్తిస్తున్నారు.అలాగే, ఈ మ్యాచ్‌లో మెరుగ్గా రాణించి తన 18 ఏళ్ల సుదీర్ఘ కెరీర్‌కు సంతృప్తికర ముగింపునివ్వాలని నెహ్రా విశ్వాసంతో ఉన్నాడు. ఇక, మూడో వన్డేలో రెండు కీలక వికెట్లు తీసిన లెగ్ స్పిన్నర్ యజ్వేంద్ర చాహల్ ఆత్మవిశ్వాసం రెట్టింపైంది. అతనితో కుల్దీప్ యాదవ్ రెండో స్పిన్నర్‌గా రావొచ్చు. అయితే నెహ్రా తుది జట్టులో ఉండడం ఖాయం గనుక.. భువీ, బుమ్రాలో ఒకరికి విశ్రాంతి ఇచ్చే ఆస్కారం ఉంది. కేదార్ స్థానంలో మనీష్ పాండే జట్టులోకి రావొచ్చు. ఈ సిరీస్‌కు ఎంపికైన హైదరాబాదీ యువ పేసర్ మహమ్మద్ సిరాజ్‌తోపాటు శ్రేయాస్ అయ్యర్ అంతర్జాతీయ అరంగేట్రం కోసం వేచి చూడక తప్పదు.
కివీలు బలంగా..టెస్టులు, వన్డేల్లో నిలకడ లోపించినా.. ఈ ఫార్మాట్లో న్యూజిలాండ్ అత్యంత బలమైన జట్టు అనడంలో సందేహం లేదు. వన్డే సిరీస్‌లో కేన్ విలియమ్సన్, నికోల్స్, లాథమ్ మెరుపులు మెరిపించారు. టీ-20లు అంటేనే మార్టిన్ గప్టిల్ రెచ్చిపోతాడు. పవర్‌ప్లేలో మెరుగ్గా ఆడే గప్టిల్ చివరి పది మ్యాచ్‌ల్లో ఐదు అర్ధ శతకాలు చేయ డం విశేషం. వెటరన్ రాస్ టేలర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే.. ట్రెంట్ బౌల్ట్, టిమ్ సౌథీ, శాంట్నర్ ఈ ఫార్మాట్లో మెరుగ్గా ఆడగలరు.
జట్లు (అంచనా)
భారత్: ధవన్, రోహిత్, కోహ్లీ (కెప్టెన్), దినేశ్, మనీష్ పాండే, ధోనీ (కీపర్), హార్దిక్, అక్షర్, కుల్దీప్/చాహల్, భువనేశ్వర్/బుమ్రా, నెహ్రా.
న్యూజిలాండ్: గప్టిల్, కొలిన్ మన్రో, విలియమ్సన్ (కెప్టెన్), టేలర్, లాథమ్ (కీపర్), నికోల్స్, గ్రాండ్‌హోమ్, శాం ట్నర్, బౌల్ట్, సౌథీ, ఇష్ సోధి.
పిచ్/వాతావరణంసాధారణంగా ఫిరోజ్ షా కోట్లా వికెట్ నెమ్మదిగా ఉంటుంది. పేస్‌లో వైవిధ్యంతో పాటు, కట్టర్లతో బౌలర్లు మెరుగ్గా రాణిం చొచ్చు. ఇక్కడ జరిగిన అంతర్జాతీయ టీ-20ల్లో మొదట బ్యాటింగ్ చేసిన జట్టు సగటు స్కోరు 146. కానీ, ఈ ఏడాది ఐపీఎల్లో సగటు 186కు పెరిగింది. కాగా, బుధవారం ఇక్కడ వర్షం పడే అవకాశం లేదు.