భారత్‌తో నాటింగ్‌హామ్ వేదికగా జరుగుతున్న మూడో టెస్టులో టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. ఐదు టెస్టుల సిరీస్‌లో ఇప్పటికే రెండు టెస్టులు ముగియగా.. రెండింటిలోనూ ఇంగ్లాండ్ విజయం సాధించి 2-0తో ఆధిక్యంలో కొనసాగుతోంది.
మరోవైపు ఇటీవల లార్డ్స్‌లో ముగిసిన రెండో టెస్టులో ఘోర పరాజయం చవిచూసిన భారత్ జట్టు కనీసం ఈ టెస్టుతోనైనా సిరీస్‌లో పుంజుకోవాలని ఆశిస్తోంది.
భారత్ తుది జట్టులో కెప్టెన్ విరాట్ కోహ్లీ మూడు మార్పులు చేశాడు. ఓపెనర్ మురళీ విజయ్ స్థానంలో శిఖర్ ధావన్, దినేశ్ కార్తీక్ స్థానంలో రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్ స్థానంలో జస్ప్రీత్ బుమ్రాని జట్టులోకి తీసుకున్నాడు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్కి కెరీర్లో ఇదే తొలి టెస్టు మ్యాచ్.