భారత్‌తో మూడో టెస్ట్ కోసం ఇంగ్లాండ్ స్టార్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్ తిరిగి జట్టులోకి వచ్చేశాడు. దీనితో ఇంగ్లాండ్ బలం మరింత పెరిగింది. గత ఏడాది బ్రిస్టల్‌లోని నైట్‌క్లబ్‌లో ఇద్దరు వ్యక్తులపై దాడి చేసిన కేసులో స్టోక్స్ విచారణ నిమిత్తం కోర్టుకు హాజరయ్యాడు.
ఈ కారణంగానే అతడు లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆడలేదు . కోర్టు విచారణలో స్టోక్స్ నిర్దోషి అని తేలింది. ఆత్మరక్షణ కోసమే స్టోక్స్ దాడికి పాల్పడ్డాడని కోర్టు తెలిపింది. తాజాగా ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు శనివారం భారత్‌తో తలపడే తుది జట్టును ప్రకటించింది. ఇందులో బెన్ స్టోక్స్‌కు స్థానం దక్కింది.
శామ్ కరన్ స్థానంలో స్టోక్స్‌కు తుది జట్టులో చోటు ఇచ్చినట్లు ఆ జట్టు సారథి రూట్ తెలిపాడు. ‘కెప్టెన్‌గా నేను తీసుకున్న నిర్ణయాల్లో అత్యంత కఠినమైన వాటిలో ఇదొకటి. జట్టులో ప్రతి ఒక్కరూ చాలా బాగా రాణిస్తున్నారు. కానీ, కొన్నిసార్లు వేటు తప్పదు. మొదటి రెండు మ్యాచ్‌ల విజయాల్లో శామ్ కీలకపాత్ర పోషించాడు. కానీ, ఇప్పుడు అతడికి జట్టులో చోటు దక్కలేదు’ అని రూట్ అన్నాడు.