విదేశీ పిచ్ లపై పేలవ బ్యాటింగ్‌ను కొనసాగిస్తూ టీమ్ఇండియా మరోసారి భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది . వర్షం కారణంగా రెండు రోజుల ఆట వృథా అయినప్పటికీ కోహ్లీసేన ఘోరవైఫల్యంతో మ్యాచ్ నాలుగురోజుల్లోపే ముగిసింది. తిరుగులేని ఆధిపత్యాన్ని కొనసాగించిన ఆతిథ్య ఇంగ్లాండ్ రెండో టెస్టులో ఇన్నింగ్స్ 159 పరుగుల తేడాతో భారత్‌పై ఘనవిజయం సాధించింది.
289 పరుగుల భారీ స్క్రోర్ నాలుగోరోజు, ఆదివారం రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన భారత్.. అండర్సన్ (4/23), బ్రాడ్ (4/44) ధాటికి కేవలం 47 ఓవర్లలో 130 పరుగులకే ఆలౌటైంది. అశ్విన్ (33 నాటౌట్) టాప్ స్కోరర్‌గా నిలిచాడు.
ఈ మ్యాచ్ కేవలం 170.3 ఓవర్లలోనే ముగిసింది. ఇంగ్లాండ్‌లో గత 100 సంవత్సరాల్లో అత్యంత త్వరగా ముగిసిన టెస్టుల జాబితాలో ఇది మూడో స్థానంలో ఉండడం విశేషం. నాలుగేళ్ల తర్వాత భారత్ ఇన్నింగ్స్ ఓటమి చవిచూసింది. చివరగా 2014లో ఓవల్ మైదానంలో ఇన్నింగ్స్ ఓటమి ఎదుర్కొంది.