//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇంజినీరింగ్ కి కూడా ఎగ్జిట్ పరీక్షా..?

Category : state national

బీటెక్‌ కంప్యూటర్‌ సైన్స్‌లో చేరి మంచి మార్కులు తెచ్చుకుంటే ఉద్యోగం వచ్చినట్లేననే భావనను విద్యార్థులు ఇక విడనాడాల్సిందే. చదువు పూర్తయిన తర్వాత గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్టు ఇన్‌ ఇంజినీరింగ్‌(గేట్‌)లో ఉత్తీర్ణులు కావడం తప్పనిసరి కాబోతోంది. అంటే ఇప్పటి వరకు ఎంటెక్‌లో ప్రవేశానికి మాత్రమే నిర్వహించే ‘గేట్‌’ ఇకపై ఉద్యోగానికి కూడా అర్హత పరీక్ష కానుంది. అఖిల భారత సాంకేతిక విద్యా మండలి(ఏఐసీటీఈ)ఈ దిశగా కసరత్తు చేస్తోంది. జాతీయస్థాయిలో నిర్వహిస్తున్న గేట్‌ను ఎగ్జిట్‌ పరీక్షగా పరిగణనలోకి తీసుకోవాలని కొద్ది రోజుల క్రితం పాలకమండలి(ఈసీ) సూత్రప్రాయ నిర్ణయం తీసుకుంది. ఇది దేశవ్యాప్తంగా లక్షల మంది ఇంజినీరింగ్‌ విద్యార్థులపై ప్రభావం చూపనుంది.

ఇంజినీరింగ్‌ విద్యలో ప్రమాణాలు పడిపోతున్నాయని, ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలు లోపిస్తున్నాయని అధ్యయనాలు వెల్లడిస్తున్న నేపథ్యంలో సంస్కరణలపై దృష్టి పెట్టిన ఏఐసీటీఈ వేగంగా నిర్ణయాలు తీసుకుంటోంది. అయిదున్నర సంవత్సరాలు ఎంబీబీఎస్‌ చదివిన తర్వాత ఎంసీఐ వద్ద రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాలంటే నేషనల్‌ ఎగ్జిట్‌ టెస్టు(నెక్ట్స్‌) అనే పరీక్షను నిర్వహించాలని కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ ఇప్పటికే ప్రతిపాదనలు తయారు చేసింది. అదే తరహాలో ఇంజినీరింగ్‌కు ఎగ్జిట్‌ పరీక్ష పెట్టాలని ఏఐసీటీఈ నిర్ణయించింది. ప్రస్తుతం ఐఐటీలు, ఇతర విద్యాసంస్థల్లో ఎంటెక్‌ చదివేందుకు బీటెక్‌ విద్యార్థులకు ఐఐటీలు, ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ కలిసి గేట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో వచ్చిన స్కోర్‌ను కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు సైతం పరిగణనలోకి తీసుకుంటున్నాయి. ఆ స్కోర్‌ను బట్టి ముఖాముఖీలకు పిలిచి ఉద్యోగాలు ఇస్తున్నాయి. గేట్‌ స్కోర్‌ను లెక్కలోకి తీసుకుంటున్న కంపెనీలు, విదేశాల్లోని విశ్వవిద్యాలయాలు ఏటా పెరుగుతున్నాయి. కేంద్రం సైతం దేనికైనా ‘ఒకటే పరీక్ష’ విధానాన్ని ముందుకు తెస్తోంది. ఈక్రమంలో బీటెక్‌ పాసైన వారికి గేట్‌నే ఎగ్జిట్‌ పరీక్షగా తీసుకోవాలని ఏఐసీటీఈ సూత్రప్రాయంగా నిర్ణయించింది. అన్ని రాష్ట్రాలను సంప్రదించి తుదినిర్ణయం తీసుకోవడానికి కనీసం ఏడాది పట్టవచ్చని అధికారుల అంచనా.