ఎస్బిఐలో ఐదు అసోసియేట్ బ్యాంకుల విలీనం పూర్తి చేసిన ఆర్థిక శాఖ మరో నాలుగు బ్యాంకులను ఏకీకరణ చేసే కసరత్తు చేస్తున్నది. వీటి విలీనంపై నీతి అయోగ్ సూచనలు స్వీకరించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వ రంగ బ్యాంక్ లైన సిండికేట్ బ్యాంకు, కెనరా బ్యాంకు, విజయా బ్యాంకు, దేనా బ్యాంకులు విలీనంపై ఇప్పటికే ఆర్థిక మంత్రిత్వశాఖ వివరణాత్మక ప్రణాళికలు సేకరించినట్లు తెలుస్తున్నది.
గతేడాది ఎస్బిఐలో అసోసియేట్ బ్యాంకులతో పాటు భారతీయ మహిళ బ్యాంకును విలీనం చేసిన విషయం తెలిసిందే. క్రితం ఏప్రిల్ నుంచే ఈ బ్యాంకులన్నీ ఎస్బిఐ పేరుతో సేవలందించడం ప్రారంభించాయి. తాజా ప్రతిపాదనలో ఉన్న నాలుగు బ్యాంకులు విలీనంపై ఆర్థిక శాఖ సీనియర్ అధికారికి విడివిడిగా తమ నివేదికలను అందజేశాయి.
ఇందులో రుణాలు, డిపాజిట్లు, మొండి బాకీలు, మానవ వనరులు, ఇతర ఆదాయాలు, వివిధ భౌగోలిక ప్రాంతాల్లో శాఖలు తదితర వాటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని అవి సమర్పించాయి. ఈ నివేదికల ఆధారంగానే బ్యాంకుల విలీన సాధ్యాసాధ్యాలపై ఒక నిర్ణయానికి రానున్నారు. ఇదే రకమైన నివేదికలను ఇతర బ్యాంకుల నుంచి కూడా సమీకరించాలని ఆర్థిక మంత్రిత్వశాఖ యోచిస్తోంది.
భారత్లో ప్రస్తుతం 21 ప్రభుత్వ రంగ బ్యాంకులున్నాయి. వీటిని మూడు, నాలుగు బ్యాంకులకే తగ్గించాలని నరేంద్ర మోడీ ప్రభుత్వం లక్ష్యంగా అడుగులు వేస్తున్నది. బ్యాంకుల పనితీరు ఆధారంగా విలీనాలు జరుగుతాయనిఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ స్పష్టం చేశారు. ఆ దిశలోనే చురుకుగా పని చేస్తున్నామని తెలిపారు.
అనుకున్నది అనుకున్నట్లుగా జరిగితే తుదకు దేశ వ్యాప్తంగా మూడు, నాలుగు పెద్ద బ్యాంకులు మాత్రమే మిగిలే అవకాశం ఉంటుంది. రెండు, అంతకన్నా ఎక్కువ బ్యాంకుల విలీనానికి కేంద్రం ఆసక్తి చూపుతున్నది. అయితే బలహీనమైన బ్యాంకు చేతికి మాత్రం బాధ్యతలు, నిర్వహణ అప్పగించబోమని ఉన్నతాధికారులు స్పష్టం చేస్తున్నారు. భౌగోళికంగా వివిధ ప్రాంతాల్లో విస్తరించి, వ్యాపారం కలిగి, బ్యాంకింగ్ ఆపరేషన్లో ఐటిపై మంచి పట్టున్న బ్యాంకుకు బాధ్యతలు అప్పగించాల్సి ఉంటుంది.