//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

నోట్ల రద్దుతో కృంగిపోయి, వేగం కోల్పోయిన ఆర్ధిక వ్యవస్థ

Category : national

గత నవంబర్‌లో ప్రధాని నరేంద్రమోడీ ఏకపక్షంగా  ప్రకటించిన పెద్దనోట్ల రద్దు మన ఆర్ధిక వ్యవస్థపై దుష్ప్రభావం చూపినట్లు ఇప్పుడు ప్రభుత్వ గణాంకాలే స్పష్టం చేస్తున్నాయి. నోట్ల రద్దు కారణంగా మన ఆర్ధిక వృద్ధి రేట్ పడి పోవడమే కాదు, ఆర్థికాభివృద్ధి వేగం సహితం మందగించింది. ఇప్పటి వరకు ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్ధిక వ్యవస్థగా పేరొందిన భారత్ ఇప్పుడు వెనుకబడింది. చైనా మన కన్నా ముందుకెళ్లింది. 

కేంద్ర గణాంకాల కార్యాలయం (సిఎస్‌ఓ) విడుదల చేసిన తాజా గణాంకాల ప్రకారం పెద్ద నోట్ల రద్దు అనంతరం 2016-17 ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక ప్రగతి 7.1 శాతానికి దిగ జారింది. అయితె ఈ కాలంలో వ్యవసాయ రంగం గణనీయ మైన ప్రగతిని నమోదు చేసింది. గత ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో (నోట్లు రద్దు తరువాత) దేశ స్థూల ఉత్పాదకత (జిడిపి) 6.1 శాతంగా నమోదయింది. ఇదే కాలంలో చైనా జిడిపి 6.9 శాతం వృద్ధి రేటును నమోదు చేసింది. 

మొత్తం విలువ ఆధారిత ప్రగతి (జివిఎ) గత మార్చి చివరి నాటికి 6.6 శాతం మేర నమోదయిందని, ఇది అంతకు ముందు ఆర్థిక సంవత్సరంలో 7.9 శాతంగా వుందని సిఎస్‌ఓ వివరించింది. గత ఆర్థిక సంవత్సరం మూడవ, నాల్గవ త్రైమాసిక కాలంలో జివిఎపై నోట్ల రద్దు ప్రక్రియ తీవ్ర ప్రభావాన్నే చూపిందని ఈ గణాంకాలు చెబుతున్నాయి. ఈ రెండు త్రైమాసికాలలో జివిఎ వరుసగా 7.3 శాతం నుండి 6.7 శాతానికి, 8.7 శాతం నుండి 5.6 శాతానికి పడిపోయింది. 

నోట్ల రద్దు అనంతరం వ్యవసాయ రంగం మినహా అన్ని రంగాలూ తిరోగమన పథంలోకి నడిచాయని సిఎస్‌ఓ వెల్లడించింది. మోడీ సర్కారు మూడేళ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో విడుదలయిన ఈ గణాంకాలపై పెదవి విరుస్తున్న ఆర్థిక నిపుణులు నల్లధనాన్ని వెలికి తీస్తామంటూ ప్రధాని చేపట్టిన నోట్ల రద్దు ప్రక్రియ సామాన్యులను ఇబ్బంది పెట్టటం తప్ప అసలు లక్ష్యాన్ని సాధించలేకపోయిందని వ్యాఖ్యానిస్తున్నారు.