//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక నిర్వహణకు ఈసీ ఏర్పాట్లు

Category : national

నగర శివారులోని డాక్టర్‌ రాధాకృష్ణ నగర్‌ నియోజకవర్గంలో ఉప ఎన్నిక అంశం మరోసారి తెరపైకి వచ్చింది. డిసెంబరు 31లోపు నిర్వహిస్తామని తాజాగా కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన నేపథ్యంలో అప్పుడే దీనిపై రాష్ట్రంలో వేడి మొదలైంది. ప్రకటన వచ్చిన మరుసటిరోజే ఎన్నికల్లో పోటీ చేయడం లేదని డీఎండీకే వ్యవస్థాపక అధ్యక్షుడు కెప్టెన్‌ విజయకాంత్‌ తేల్చేశారు. ఇప్పటికే పళనిస్వామి ప్రభుత్వంపై గుర్రుగా ఉన్న టీటీవీ దినకరన్‌, ఏడాదిగా రాష్ట్రంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో తమకే లాభం కలగనుందని భావిస్తున్న స్టాలిన్‌ దీన్ని ఒక అవకాశంగాతీసుకుంటున్నారు.

అదే సమయంలో అన్నాడీఎంకేతో భాజపా జత కట్టి పోటీ చేసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. కమలనాథులు కూడా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు దీన్ని ఒక అవకాశంగా భావిస్తున్నారు. గతంలో భాజపాతో పొత్తు ఉంటుందని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ప్రకటించిన నేపథ్యంలో ఆ పార్టీలు కలిసే పోటీ చేస్తాయని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఈ క్రమంలో ఉప ఎన్నికలో విజయం సాధించడానికి అటు అధికార పార్టీ, ఇటు ప్రతిపక్షం సహా ఇతరులు హోరాహోరీగా తలపడనున్నారు.

జయ మరణంతో...

ఆర్కేనగర్‌ నియోజకవర్గంలో వరుసగా రెండు సార్లు పోటీ చేసి విజయం సాధించిన జయలలిత గతేడాది డిసెంబరులో మరణించారు. దీంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 12న నిర్వహించడానికి ఈసీ నిర్ణయించింది. విచ్చలవిడిగా నగదు పంపిణీ చేసి ఓటర్లను ప్రలోభపెట్టారని ఫిర్యాదులు రావడంతో ఈసీ ఆ ఎన్నికను రద్దు చేసింది. ఉప ఎన్నిక నిర్వహించకుండా ఎక్కువ రోజులు కొనసాగడం రాజ్యాంగ విరుద్ధమని, వెంటనే జరిపేలా ఈసీకి ఆదేశాలు ఇవ్వాలని రమేష్‌ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో డిసెంబరు 31లోపు నిర్వహించాలని ఎన్నికల సంఘానికి మద్రాసు హైకోర్టు అదేశాలు జారీ చేసింది. ఆ మేరకు గురువారం కేంద్ర ఎన్నికల సంఘం ఇతర రాష్ట్రాల ఎన్నికలతోపాటు ఆర్కేనగర్‌ ఉప ఎన్నిక కూడా నిర్వహిస్తామని తెలిపింది. దీంతో మరోసారి ఈ అంశం తెరపైకి వచ్చింది.

పొత్తు ఉంటుందా?

భాజపాతో పొత్తుకు అన్నాడీఎంకే సిద్ధమవుతోందా..? ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో కలిసే పోటీ చేస్తుందా?..... అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఆ మేరకు స్థానిక ఎన్నికలకు ముందు పొత్తు విషయంపై నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఇదివరకు చేసిన వ్యాఖ్యలను గుర్తు చేస్తున్నారు. తాజా పరిణామాల నేపథ్యంలో అటు అధికార అన్నాడీఎంకే, ఇటు భాజపా కూడా 2019 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఆర్కేనగర్‌ ఉప ఎన్నికను ఒక పరీక్షగా భావిస్తున్నాయి. ఈ ఫలితాలను బట్టి తదుపరి ఎన్నికల ప్రణాళికను రూపొందించుకోవాలని అనుకుంటున్నాయి. అదే సమయంలో 18 మంది సొంత పార్టీ ఎమ్మెల్యేలపై వేటుతోపాటు శశికళ, టీటీవీ దినకరన్‌ల రూపంలో పొంచి ఉన్న ప్రమాదాన్ని ఎదుర్కోవడానికి అధికారపక్షం రంగంలోకి దిగింది. ఉప ముఖ్యమంత్రి పన్నీర్‌సెల్వం దిల్లీకి వెళ్లిన మరుసటిరోజే రాష్ట్రానికి డెంగీ పరిశీలన బృందం రావడం, ఆర్కేనగర్‌ ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం పచ్చజెండా వూపడం లాంటి పరిణామాలు అధికార పక్షానికి కలిసి వచ్చేవేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

విపక్షాలు వ్యూహాత్మకంగా...

రాష్ట్ర ప్రభుత్వం కూలుతుందని, త్వరలో వచ్చే ఎన్నికల్లో తామే విజయం సాధిస్తామని చెబుతూ వస్తున్న డీఎంకే కార్యనిర్వాహక అధ్యక్షుడు స్టాలిన్‌ విపక్షాలను కూడగట్టే పనిలో విజయవంతం అయ్యారు. ఇటీవల జరిగిన నీట్‌ వ్యతిరేక ఉద్యమం, ఉద్యోగులు, రైతుల సమస్యలు వంటి అంశాలపై జరిగిన ఆందోళనల్లో విపక్షాలను ఒకతాటిపైకి తీసుకొచ్చారు. ఆ ధీమాతోనే ఆయన ఆర్కేనగర్‌ ఉప ఎన్నికలో సత్తాచాటి అధికార పార్టీకి హెచ్చరికలు పంపాలని భావిస్తున్నారు. సొంత పార్టీలో కార్యకర్తలకు తర్వాత అధికారంలోకి వచ్చేది తామేనని నమ్మకం కలిగించాలని పట్టుదలగా ఉన్నారు. ఇదే సమయంలో 18 మంది ఎమ్మెల్యేలపై వేటు పడటం, పదవి కట్టబెట్టిన శశికళ వర్గానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటుండటంతో పళనిస్వామి ప్రభుత్వాన్ని కూల్చాలని యత్నిస్తున్న టీటీవీ దినకరన్‌ కూడా ఈ ఎన్నికను ఒక అవకాశంగా భావిస్తున్నారు. ఏప్రిల్‌ నాటి ఉప ఎన్నికలప్పుడు కూడా విజయం సాధిస్తానని ధీమాగా ఉన్న టీటీవీకి నగదు పంపిణీ ఆరోపణలతో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ గుర్తు కోసం లంచం ఇచ్చారని ఆయన్ను దిల్లీ పోలీసులు అరెస్టు చేసి తీహార్‌జైలుకు తరలించారు. ఇప్పుడు మరోసారి ఉప ఎన్నికలో పోటీ చేసి సత్తా చాటాలని ఆయన భావిస్తున్నట్లు సమాచారం. ఇతర పార్టీలు కూడా ఈ ఎన్నికపై ధీమాగా ఉన్నాయి. మరోవైపు సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ రాజకీయాల్లోకి వస్తారని, త్వరలో పార్టీ పెడుతారని ప్రచారం సాగుతోంది.

Related News