దేశ రాజధాని ఢిల్లీలో బుధవారం(ఫిబ్రవరి-20-2019) తెల్లవారుజామున భూకంపం సంభవించింది. పలు సెకన్ల పాటు భూమి కంపించింది. రిక్టర్ స్కేల్ పై ఈ ప్రకంపనల తీవ్రత 4.0 గా నమోదైంది. ఢిల్లీ-ఎన్సీఆర్ పరిధిలో భూకంపం సంభవించింది. భూ ప్రకంపనలతో ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు పెట్టారు. ఉత్తరప్రదేశ్లోని భాగ్పట్ కేంద్రంగా భూమికి 5కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రాన్ని అధికారులు గుర్తించారు. ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించలేదని తెలిపారు.
జమ్మూ కశ్మీర్లో మొన్న భూ ప్రకంపనలు నమోదయ్యాయి. రిక్టర్ స్కేలుపై భూప్రకంపనల 4.6 తీవ్రతతో భూకంపం నమోదైంది. భూమి కంపిస్తుండటంతో ప్రజలు భయాందోళనలతో వీధుల్లోకి పరుగులు పెట్టారు. పలు భవనాల్లోని వస్తువులు కదిలాయని, కొన్ని చోట్ల పాత గోడలు కూలాయని తెలుస్తోంది. ఆస్తి, ప్రాణ నష్టంపై సంభవించలేదు కానీ భూకంపం సంభవించిన మాట వాస్తవమేనని, ఇది చాలా స్వల్పమైనదని అధికారులు ప్రకటించారు. ఈ ప్రకంపనల ప్రభావం హర్యానా, పంజాబ్ రాష్ట్రాల్లోనూ కనిపించింది.