Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

1000 కోట్లు దోచేసిన ఓ కుటుంబ దందా ... ఈ బిజ్ గుట్టు రట్టు చేసిన తెలంగాణా పోలీస్

Category : politics state

మోసపోయే వాళ్లనే ఎంత కాలం మోసం చేసే వాళ్ళు ఉంటారు. డబ్బు సంపాదించడానికి కష్టపడకుండా, సులభంగా సంపాదించవచ్చని అత్యాశకు పోయిన వాళ్ళే మోసగాళ్ల చేతిలో నష్టపోతారు. ప్రజల బలహీనతలను ఆసరాగా చేసుకొని, ఆర్థిక అవసరాలను దృష్టిలో పెట్టుకొని ఈ బిజ్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న నోయిడాకు చెందిన ఓ కుటుంబాన్ని తెలంగాణ పోలీసులు అరెస్ట్ చేశారు. దేశవ్యాప్తంగా లక్షలాదిమందిని ఈ బిజ్ పేరుతో ఈ ఊబిలోకి దింపి 1000 కోట్ల మోసానికి పాల్పడిన ఈ కుటుంబం చైన్ సిస్టం ద్వారా సాగే ఈ దందాలో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలను ఈ ఊబిలోకి దింపుతుంది. దాదాపు 18 ఏళ్లుగా వీరు దందా సాగిస్తున్న పట్టించుకున్న నాథుడు లేడు. తాజాగా తెలంగాణ రాష్ట్ర పోలీసులు జగిత్యాల వాసి ఫిర్యాదుతో కేసు నమోదు చేసి ఈ బిజ్ పేరుతో సాగుతున్న దందాకు చెక్ పెట్టారు.

నిరుపేద లో పుట్టడం తప్పు కాదు కానీ, పేదవారిగా చనిపోవడం తప్పు, డబ్బు సంపాదించాలన్న ఆలోచన లేకపోవడం మరింత పెద్ద తప్పు అంటూ ప్రజలను రెచ్చగొట్టి మధ్యతరగతి కుటుంబాలను టార్గెట్ గా చేసుకుని అన్ని ప్రాంతాలు పర్యటించి పెద్ద పెద్ద హోటల్స్ లో సభలు సమావేశాలు నిర్వహించి సులభంగా డబ్బులు సంపాదించడంటూ పక్కా ప్లాన్ తో కొందరితో ఉపన్యాసాలు ఇప్పించారు. ఇంకేముంది వాళ్ళు చెప్పినటువంటి మాటలు నమ్మిన మధ్యతరగతి కుటుంబాలు ఈ ఊబిలో పడిపోయాయి. ఇలా దేశవ్యాప్తంగా ఈ బిజ్ పేరుతో 1000 కోట్ల మోసం వెలుగుచూసినట్లు తెలుస్తోంది. 2001లో నోయిడా కేంద్రంగా పవన్ మల్హాన్ ఈబిజ్ కంపెనీ తెరిచాడు. ఇతను ఎండీగా, భార్య అనిత డైరెక్టర్‌గా, కుమారుడు హితిక్ కంపెనీ వ్యవహారాలను పర్యవేక్షించేవారు. ఇక వీరు మిమ్మిల్ని కుబేరులుగా మారుస్తామని అయితే అందుకు రుసుము కింద రూ.16,821 కట్టించుకుంటారు.

ఒకసారి సభ్యులుగా చేరిన వారు మరో ఇద్దరిని కంపెనీలో సభ్యులుగా చేర్పించాలి. వారు మరో ఇద్దరిని చేర్పిస్తే కమిషన్‌గా రూ.2,700 వస్తుందని చెబుతారు. ఇలా 18 సంవత్సరాల్లో 7 లక్షల మంది నుంచి రూ.1000 కోట్లు వసూలు చేశారు. తాజాగా జగిత్యాల మండలం మహాలక్ష్మీనగర్‌కు చెందిన సామల వివేక్‌కు తెలిసిన వారు చెప్పడంతో రూ.16821 చెల్లించి మోసపోవటంతో సామల వివేక్ మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. రంగంలోకి దిగిన పోలీసులు ఢిల్లీలో ఉన్న పవన్, అనిత, అతని కుమారుడు హితిక్‌ను అరెస్ట్ చేశారు.బ్యాంకుల సహకారంతో ఈబిజ్‌కు చెందిన రూ.70.5 కోట్ల డిపాజిట్లను ఫ్రీజ్ చేశారు. ఈ కంపెనీ మోసాలపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, జమ్మూకశ్మీర్, ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, తమిళనాడు, గోవాలోనూ కేసులు నమోదైనట్లు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ తెలిపారు. ఇలాంటి చైన్ వ్యాపారం చేసే ముఠాలు ఇంకా దేశవ్యాప్తంగా ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వారి నుండి తస్మాత్ జాగ్రత్త.

Related News