//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఘరానా దొంగలకి చెప్పు దెబ్బ వంటి వార్త !

Category : national

బ్యాంకు నుండి తీసుకున్న రుణాలు చెల్లించడంలో డ్వాక్రా మహిళలను చూసి గుణపాఠం నేర్చుకోవాలి. బ్యాంకుల నుండి కోటానుకోట్లు రుణాలు తీసుకొని ఉడాయించే బడా బాబులు ఈ ఆడపడుచులను ఆదర్శంగా తీసుకోవాలి. పంచవ్యాప్తంగా వ్యాపార సామ్రాజ్యం విస్తరించుకుని మాతృదేశాన్ని ఆర్థికంగా దెబ్బతీస్తున్నారు కొందరు ఎగవేత్తదారులు.

డ్వాక్రా మహిళలు తీసుకున్నరుణాలు సమయానికి చెల్లించడానికి చాలా కష్టపడుతున్నారు. సకాలంలో కిస్తీలు చెల్లిస్తున్నారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఏటా 270 కోట్లకు పైగా రుణాలు తీసుకుని ప్రతి నెలా ఐదో తేదీలోపు క్రమం తప్పకుండా కిస్తీలు చెల్లిస్తుండటమే అందుకు కారణం. హైదరాబాద్‌ మహా నగర పాలక సంస్థ(జీహెచ్‌ఎంసీ) పరిధిలో ఉన్న స్వయం సహాయక సంఘాలు(ఎస్‌హెచ్‌జీ) చాలా ప్రత్యేకమైనవి. నిరుపేద, పేద, మధ్య తరగతి మహిళలతో బస్తీలు,కాలనీ స్థాయిల్లో సంఘాలు ఏర్పడతాయి.

ఒక్కో సంఘంలో పది మంది ఉంటారు. అలాంటి సంఘాలు నగరవ్యాప్తంగా 45 వేలు ఉన్నాయి.అవన్నీ 1,041 ఎస్‌ఎల్‌ఎఫ్‌(స్లమ్‌ లెవల్‌ ఫెడరేషన్‌)లుగా ఏర్పడ్డాయని, వాటిలో చురుగ్గా పనిచేసే వాళ్లతో 26 టీఎల్‌ఎఫ్‌(టౌన్‌ లెవల్‌ ఫెడరేషన్‌)లను ఏర్పాటు చేశామని జీహెచ్‌ఎంసీ పట్టణ సామాజికాభివృద్ధి విభాగం అదనపు కమిషనర్‌ భాస్కరాచారి తెలిపారు.

అన్ని సంఘాలకు కలిపి ఒక్కో ఆర్థిక సంవత్సరంలో బ్యాంకుల నుంచి ఎంత రుణం ఇప్పించాలనే అంశంపై ఏటా లక్ష్యం నిర్దేశించుకుంటామన్నారు.అలా 2017-18 ఆర్థిక సంవత్సరానికి 298.26 కోట్లు ఇప్పించాలని అనుకుంటే ఇప్పటి వరకు 8,142 ఎస్‌హెచ్‌జీలకు 275.21 కోట్లు ఇచ్చినట్లు వివరించారు.ప్రస్తుత ఆర్థిక సంవత్సర లక్ష్యం 92.27 శాతం పూర్తయిందని,మిగిలిన 8 శాతం లక్ష్యాన్ని చేరుకునేందుకు మరిన్ని సంఘాలతో సమావేశం ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు.

99 శాతం మంది రుణం తీసుకుని ఠంచనుగా కిస్తీలు చెల్లిస్తోన్న పొదుపు సంఘాలుగా గ్రేటర్‌ ఎస్‌హెచ్‌జీలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయి.ఇతర రాష్ట్రాల్లో ఆ పరిస్థితి లేదు.అందుకే ఆయా రాష్ట్రాల నుంచి సామాజికాభివృద్ధి విభాగాలు తరచూ నగరానికి వస్తుంటాయి.ఇటీవలే చత్తీస్‌గఢ్‌ రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నగరానికి వచ్చి పలు సంఘాలతో సమావేశమయ్యారు.

ఆత్మగౌరవాన్ని చాటడం బ్యాంకు నుంచి తీసుకున్న రుణమైనా,ఇతరుల దగ్గర అప్పు చేసినా వాటిని ఎలాగైనా తీర్చాలనేది పొదుపు సంఘాల ప్రగతి మంత్రం.చేతిలో సమయానికి డబ్బులేకపోయినా తోటి మహిళలు చిన్నచూపు చూడకూడదనే ఆత్మగౌరవంతో ఇతరుల దగ్గర బదులు తీసుకుని మరీ ప్రతి నెలా ఐదో తేదీలోపు కిస్తీలు కడుతున్న మహిళలు గరిష్ఠంగా 99 శాతం మంది ఉన్నారు.

ప్రజల సొమ్మును బ్యాంకుల ద్వారా తీసుకుని చివరికి చేతులెత్తేస్తోన్న ఆయా వ్యాపార సంస్థల అధినేతలు డ్వాక్రా మహిళలను చూసి గుణపాఠం నేర్చుకోవచ్చని గణాంకాల్ని చూస్తే స్పష్టమవుతోంది. తమ స్థాయి వరకు చేసిన అప్పులని తీర్చడానికి చెమటోడ్చి ఎలా అయినా కట్టేస్తున్న ఆ ఆడవాళ్ళని చూసి అయినా సిగ్గు తెచ్చుకోవాలి మోడీలయినా, మాల్యాలయినా. తాహతుకి మించి అప్పులు చేసి ఎగ వేసి పారిపోయిన ప్రతి ఒక్క బడా బాబుకి ఈ వార్త ఒక చెప్పు దెబ్బ లాంటిది అని భావిస్తున్నాం.