ప్రముఖ ఔషద ఉత్పత్తుల దిగ్గజం డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీ ఆకర్షణీయ ఆర్థిక ఫలితాలను ప్రకటించింది. 2017 జనవరి నుంచి మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికం (క్యూ4)లో కంపెనీ నికర లాభాలు మూడు రెట్లు పెరిగి రూ.312.5 కోట్లకు చేరాయి. గతేడాది ఇదే త్రైమాసికంలో రూ.74 కోట్ల లాభాలు నమోదు చేసుకుంది. శుక్రవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డాక్టర్ రెడ్డీస్ లాబరేటరీ సిఇఒ జివి ప్రసాద్ కంపెనీ ఆర్థిక ఫలితాలను వెల్లడించారు. నిర్వహణ వ్యయంలో తగ్గుదలకు తోడు విదేశీ మారకం నష్టాలు కంపెనీ ఫలితాలకు మద్దతునిచ్చాయి. ఉత్తర అమెరికా అమ్మకాలు పడిపోవడంతో కంపెనీ రెవెన్యూలో 5 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో రెడ్డీస్ మొత్తం రెవెన్యూ రూ.3,554.2 కోట్లుగా నమోదయ్యింది. 2016 ఇదే త్రైమాసికంలో రూ.3755.2 కోట్ల రెవెన్యూ ఆర్జించింది. కాగా అమెరికా వ్యాపారంలో 19.35 శాతం తగ్గుదల చోటు చేసుకుంది. కాగా యూరప్, ఇండియా, ఇతర వర్థమాన దేశాల్లో జనరిక్ వ్యాపారంలో వృద్ధి చోటు చేసుకుంది.
మార్చి 2017తో ముగిసిన ఏడాదికి గాను రూ.5 ముఖ విలువ కలిగిన ఈక్విటీ షేర్‌పై రూ.20 డివిడెండ్ అందించడానికి కంపెనీ బోర్డు ఆఫ్ డైరెక్టర్లు ఆమోదం తెలిపారు. 2016-17 ఆర్థిక సంవత్సరం పెద్ద సవాల్‌తో ముగిసిందని డాక్టర్ రెడ్డీస్ సిఇఒ జివి ప్రసాద్ అన్నారు. అమెరికా మార్కెట్లో అనేక ఉత్పత్తుల అనుమతులకు ఇబ్బందులు ఎదురైయ్యాయన్నారు. కాగా ఇతర భౌగోళిక ప్రాంతాల్లో మంచి ప్రగతిని కనబర్చామన్నారు. కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేశామన్నారు. వ్యయ విధానం, సంస్థ సమగ్ర నాణ్యతను హేతుబద్దీకరిస్తామన్నారు. గత త్రైమాసికంలో పరిశోధన, అభివృద్ధి విభాగంతో కలుపుకుని కంపెనీ మొత్తం వ్యయం 38 శాతం తగ్గి రూ.313.5 కోట్లకు తగ్గిందన్నారు. శుక్రవారం బిఎస్ఇలో డాక్టర్ రెడ్డీస్ షేర్ ధర 0.30 శాతం లేదా రూ.7.70 తగ్గి రూ.2,584.70 వద్ద ముగిసింది.